Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ సీఎం కుమారుడికి జీవిత ఖైదు
posted on: Apr 6, 2026 8:19PM

23 ఏళ్ల నాటి సంచలన కేసులో హైకోర్టు కీలక తీర్పురాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఎన్సీపీ నేత రామవతార్ జగ్గీ హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగిని దోషిగా తేలుస్తూ న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం విశేషం.ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2003 జూన్ 4వ తేదీన రాయ్‌పూర్‌లో ఎన్సీపీ రాష్ట్ర కోశాధికారి రామవతార్ జగ్గీ దారుణ హత్యకు గురయ్యారు.
అప్పట్లో అజిత్ జోగి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ రాజకీయ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తొలుత ఈ కేసును సాధారణ దొంగతనం జరిగిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, బాధితుడి కుమారుడు సతీష్ జగ్గీ న్యాయపోరాటం చేయడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) రంగంలోకి దిగింది.సిబిఐ జరిపిన విచారణలో అమిత్ జోగి ఈ హత్యకు వ్యూహరచన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, 2007లో ప్రత్యేక సిబిఐ కోర్టు ఈ కేసులో 28 మందికి శిక్ష విధించినప్పటికీ, సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో అమిత్ జోగిని నిర్దోషిగా విడుదల చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ మరియు జగ్గీ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ అరవింద్ కుమార్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరిస్తూ.. సాక్ష్యాధారాలను పరిశీలించడంలో ట్రయల్ కోర్టు పొరపాటు చేసిందని అభిప్రాయపడింది. మిగిలిన 28 మందికి ఏ సాక్ష్యాల ప్రాతిపదికన శిక్ష పడిందో, అవే సాక్ష్యాలు అమిత్ జోగికి కూడా వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది.
మూడు వారాల లోపు పోలీసులకు లొంగిపోవాలని అమిత్ జోగిని ఆదేశించింది.ఈ తీర్పుపై అమిత్ జోగి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు వాదనలు వినిపించేందుకు సరైన సమయం ఇవ్వలేదని, కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే తీర్పు వెలువడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఈ తీర్పును సవాల్ చేస్తూ త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆయన మీడియాకు వెల్లడించారు.మరోవైపు, రామవతార్ జగ్గీ కుమారుడు సతీష్ జగ్గీ ఈ తీర్పును స్వాగతించారు. 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన తండ్రికి న్యాయం జరిగిందని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.
సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ తీర్పు నిరూపించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమిత్ జోగి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో సుప్రీంకోర్టులో జరిగే పరిణామాలు ఈ కేసులో మరింత కీలకం కానున్నాయి. అమిత్ జోగి నిర్ణీత గడువులోగా లొంగిపోతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.


.webp)



