Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు రాజకీయ, సామాజిక రూపాంతరం.. రెండు శతాబ్దాల ద్రవిడ ఉద్యమ ప్రస్థానం
posted on: May 26, 2026 4:45PM

నేటి తమిళనాడు రాష్ట్ర సామాజిక, రాజకీయ స్వరూపం స్వల్ప కాలంలో అకస్మాత్తుగా ఆవిర్భవించినది కాదు. ప్రస్తుత తమిళ సమాజం ఆలోచనా విధానం, సంస్కృతి వెనుక దాదాపు రెండు వందల సంవత్సరాల సుదీర్ఘమైన చారిత్రక పరిణామక్రమం దాగి ఉంది. వలస పాలకుల కాలంలో జరిగిన పరిశోధనలు, భాషా పరమైన చర్చలు, సమాజంలో వెల్లువెత్తిన సంస్కరణోద్యమాలు, ద్రావిడ సిద్ధాంతాలు, వెండితెర ప్రభావం ఇవన్నీ కలగలిసి నేటి తమిళ అస్తిత్వాన్ని రూపుదిద్దాయి. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని కేవలం ఒకే ఒక రాజకీయ కోణంలో కాకుండా.. చారిత్రక, సామాజిక దృక్పథంతో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకే రకమైన వ్యూహం వల్ల జరిగింది కాదనీ, వివిధ స్థానిక ఉద్యమాలు, సామాజిక అసమానతల ఫలితంగా ఏర్పడిన సంక్లిష్ట చరిత్ర అని స్పష్టమవుతోంది.
బ్రిటిష్ పాలనా కాలంలో భారతదేశాన్ని ఒక పురాతనమైన, బలమైన హిందూ నాగరికత కలిగిన దేశంగా వారు భావించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో.. అందునా తమిళ ప్రాంతంలో ఉన్న ఆలయ ఆధారిత జీవన విధానం, భక్తి ఉద్యమాలు, ఆళ్వార్లు, నాయనార్ల సంస్కృతిని మార్చడం అంత సులభం కాదని వారు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వలస పాలకులు, క్రైస్తవ మిషనరీలు, కొంతమంది పాశ్చాత్య పండితులు స్థానిక సమాజాన్ని అర్థం చేసుకోవడానికి భాష, జాతి ప్రాతిపదికన వర్గీకరణలు చేయడం ప్రారంభించారు. ఈ రకమైన వర్గీకరణలే తదనంతర కాలంలో ఇక్కడ ఆర్యులు, ద్రవిడుల మధ్య చర్చకు, ద్రవిడ రాజకీయాల స్థాపనకు బలమైన బౌద్ధిక పునాదిగా మారాయి. పొరుగు భాషల పరిశోధనల విషయానికి వస్తే.. 1810 - 1820 మధ్య కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేసిన బ్రిటిష్ అధికారి ఫ్రాన్సిస్ వైట్ ఎలిస్ ఒక సరికొత్త విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించాడు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలన్నీ ఒకే కుటుంబానికి చెందినవనీ.. వీటికి సంస్కృతం లేదా ఇండో, ఆర్యన్ భాషలతో సంబంధం లేదని ఆయన ప్రతిపాదించాడు. దీనిని కొనసాగిస్తూ 1856లో రాబర్ట్ కాల్డ్‌వెల్ అనే పండితుడు తన ప్రసిద్ధ గ్రంథం ద్వారా ద్రావిడ భాషలు అనే వర్గీకరణను మరింత బలంగా ముందుకు తెచ్చాడు.
మొదట కేవలం భాషా శాస్త్ర పరిశోధనగా ప్రారంభమైన ఈ భావన.. రానురాను ఒక బలమైన రాజకీయ మరియు సాంస్కృతిక గుర్తింపుగా రూపాంతరం చెందింది. కాలక్రమేణా దీని చుట్టూ బ్రాహ్మణులు వర్సెస్ స్థానికులు అనే వాదాలు పెరగడమే కాకుండా.. బ్రాహ్మణాధిక్యతను ప్రశ్నించడానికి కొన్ని మిషనరీ వర్గాలు దీనిని ఒక సామాజిక, రాజకీయ ఆయుధంగా మార్చుకున్నట్లు ఆధునిక విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే 1901లో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన జనాభా గణనలో ఆర్య, ద్రవిడ అనే వర్గీకరణలను అధికారికంగా ఉపయోగించడం ప్రారంభించారు. ఇది కేవలం ఒక గణాంకాల సేకరణ మాత్రమే కాకుండా.. భారత సమాజాన్ని విడదీసి చూసే వలస పాలకుల దృక్పథానికి అద్దం పట్టింది. సరిగ్గా ఇదే సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాలలో బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వర్గాల మధ్య తీవ్రమైన అసమానతలు ఉండటం స్థానికులలో సామాజిక అసంతృప్తి పెరిగేందుకు దోహదపడింది. ఈ అసంతృప్తిని ఒక సంస్థాగత రూపంలోకి తెస్తూ.. 1916లో సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్, అంటే జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది. సామాజిక న్యాయం ధ్యేయంగా ఏర్పడిన ఈ పార్టీ బ్రాహ్మణేతరుల హక్కుల కోసం, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం, దేవాలయాల నిర్వహణలో సంస్కరణల కోసం పెద్ద ఎత్తున పోరాడింది.
ఇది తమిళ రాజకీయ చైతన్యానికి తొలి సంస్థాగత పునాదిగా నిలిచింది. జస్టిస్ పార్టీ ఇచ్చిన ఊపుతో 1925లో ఈవి రామస్వామి (పెరియార్) స్వాభిమాన ఉద్యమాన్ని (సెల్ఫ్-రెస్పెక్ట్ మూవ్‌మెంట్) ప్రారంభించి ద్ర విడ సిద్ధాంతాలకు ఒక బలమైన తాత్విక పునాది ఇచ్చారు. సమాజంలో ఉన్న కుల వ్యవస్థను, సాంప్రదాయ మత ఆచారాలను, బ్రాహ్మణాధిక్యతను ఆయన సవాలు చేశారు. మహిళల హక్కులు, సమాజంలో సమానత్వం కోసం పెరియార్ చేసిన పోరాటాలు తదనంతర కాలంలో ద్ర విడర్ కజగం (డీకే), ఆ తర్వాత పుట్టుకొచ్చిన డీఎంకే (డీఎంకే), ఏఐఏడీఎంకే వంటి ప్రధాన రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు మూలకారణంగా మారాయి. మరోవైపు తమిళనాట ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా అపారమైన భూములు, ఆస్తులు కలిగి ఉండి, విద్యా సాంస్కృతిక కార్యకలాపాలకు నిలయాలుగా ఉన్న ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుండి నేటి ద్రవిడ ప్రభుత్వాల వరకు ఆలయాలపై సాధించిన ఈ నియంత్రణను కొందరు కుల వివక్షను రూపుమాపే సామాజిక న్యాయ చర్యగా ప్రసంశిస్తుంటే.. మరికొందరు ఇది హిందూ సమాజం ఉనికిని దెబ్బతీసే ప్రయత్నంగా విమర్శిస్తున్నారు. ఇది ఇప్పటికీ తమిళనాడులో సామాజిక న్యాయానికి, మత స్వేచ్ఛకు మధ్య ఉన్న ఒక పెద్ద వివాదాస్పద అంశంగానే కొనసాగుతోంది.
తమిళ సమాజం మార్పులో సినిమా రంగం పోషించిన పాత్ర కూడా చాలా అసాధారణమైనది. అక్కడ సినిమా అనేది కేవలం వినోద సాధనంగా కాకుండా రాజకీయ భావజాల వ్యాప్తికి ఒక ముఖ్యమైన వాహకంగా ఉపయోగపడింది. ముఖ్యంగా 1950 నుంచి 1970ల మధ్య కాలంలో సినిమాల ద్వారా ద్రవిడ అస్తిత్వాన్ని, సాంప్రదాయ వ్యతిరేక వ్యంగ్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వెండితెరపై రాణించిన అన్నాదురై, ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత వంటి నేతలు ప్రజాదరణ పొంది రాజకీయ ప్రవేశం చేసి ముఖ్యమంత్రులు అయ్యారు. సినిమాలలో సాంప్రదాయ పద్ధతులు, పూజలు చేసే పాత్రలను హేళన చేయడం, వెనుకబడిన వారిగా చూపించడం వంటివి దీర్ఘకాలంలో ప్రజల మానసికతపై తీవ్ర ప్రభావం చూపాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే, వలస కాలం నుండి సాగిన ఈ ద్రవిడ ఉద్యమాలు ఒక వైపు నువ్వు హిందువువి కాదే, ద్రావిడుడివి అనే ప్రత్యేక గుర్తింపును ప్రచారం చేసినప్పటికీ.. క్షేత్రస్థాయి చారిత్రక వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.
తమిళ సమాజంలో ద్రావిడ భాషా గర్వం, సామాజిక న్యాయంతో పాటు శైవ, వైష్ణవ భక్తి సంప్రదాయాలు కూడా సమాంతరంగా పెనవేసుకుని ఉన్నాయి. కాబట్టి హిందూ, ద్రవిడ అనే విభజన కేవలం ఒక రాజకీయ, తాత్విక నిర్మాణం మాత్రమే తప్ప.. అది పూర్తి చారిత్రక సత్యం కాదు. ద్రవిడ గుర్తింపు హిందూ అస్తిత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయింది.. కానీ దానిని సరికొత్త కోణంలో ప్రశ్నించి పునర్నిర్వచించింది. ఒక తరం ఆలోచనను మార్చడం ద్వారా వ్యవస్థను మార్చవచ్చనే భావన తమిళనాడు విషయంలో నిజమైనప్పటికీ, అక్కడ నేటికీ మతాచారాలు, యాత్రలు. ఆలయ సంస్కృతి అంతే బలంగా కొనసాగుతున్నాయి. అందువల్ల, తమిళనాడు స్థితిని కేవలం ఒక కుట్రగానో లేదా కేవలం ఒక సామాజిక న్యాయ విజయంగానో సరళీకరించి చూడలేము. వలస పాలకుల వ్యూహాలు, స్థానిక సామాజిక ఉద్యమాలు, భాషాభిమానం, రాజకీయ ప్రయోజనాలు అన్నీ కలగలిసిన ఒక సంక్లిష్ట చారిత్రక ప్రక్రియగా మాత్రమే దీనిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.






