Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికా వర్సెస్ యూరప్.. కారణాలేంటో తెలుసా?
posted on: Apr 13, 2026 2:34PM

కంఠంనేని సీతారాం
అంతర్జాతీయ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా సన్నిహిత మిత్రదేశాలుగా వెలుగొందుతున్న అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ప్రస్తుతం తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. గతంలో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో అమెరికా అవలంబించిన కఠిన వైఖరి ఈ విభేదాలకు కారణమని యూరోపియన్ దేశాల మేధావులు గట్టిగా చెబుతుంటారు. అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న ఈ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ట్రంప్ దెబ్బతీశారని, ఆయన నిర్ణయాలు కూటమి పతనాన్ని శాసించాయని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవలం ఒక వ్యక్తి ప్రమేయం కంటే లోతైన వ్యవస్థాగత కారణాలు ఉన్నాయన్నది ప్రపంచ మేధావులు విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి.. అమెరికాలో యూరప్ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి ట్రంప్ ఒక ప్రతినిధిగా నిలిచారే తప్ప.. పూర్తిగా ఆయన వల్లే ఈ పరిస్థితి వచ్చిందనడం సరికాదని వారి అభిప్రాయం. యూరోపియన్లు తమను తాము అత్యంత నాగరికులుగా, విద్యావంతులుగా భావిస్తూ అమెరికన్లను తక్కువ చేసి చూసే ధోరణి ఎప్పటి నుంచో ఉంది. కానీ రక్షణ, ఆర్థిక పరమైన అంశాల్లో యూరప్ దేశాలు పూర్తిగా అమెరికాపై ఆధారపడతాయి. తమను చులకనగా చూస్తూ.. మళ్లీ అన్నిటికీ తమపైనే పూర్తిగా ఆధారపడుతున్న యూరప్ దేశాల తీరు అగ్రరాజ్యానికి మింగుడు పడటం లేదు.
గతంలో అంటే మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో యూరప్‌ను రక్షించడానికి అమెరికా తన సైనికుల రక్తాన్ని ధారబోసింది. యుద్ధం తర్వాత మార్షల్ ప్లాన్ వంటి పథకాల ద్వారా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడమే కాకుండా, వాటి రక్షణకు ద్వారా రక్షణ కవచాన్ని నిర్మించింది.
అయితే.. ఆర్థిక, రక్షణ రంగాల్లో అమెరికాపై పూర్తిగా డిపెండెంట్ అయిన యూరోపియన్ దేశాలు.. సామాజిక సంక్షేమ పథకాలకే ఎక్కువ వ్యయం చేస్తూ.. రక్షణ విషయంలో అది అమెరికా బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 2006లో తమ జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగానికి కేటాయించాలని నాటో దేశాలు నిర్ణయించినప్పటికీ.. ఇప్పటికీ ఆ లక్ష్యాన్ని యూరోపియన్ దేశాలు చేరుకోలేదు. అదే సమయంలో అమెరికా రక్షణ బాధ్యతను మోస్తుంటే, యూరప్ దేశాలు మాత్రం అమెరికా ప్రధాన శత్రువులైన రష్యా నుండి ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ, చైనా పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థికంగా బలపడ్డాయి. ఈ ధోరణినే అగ్రరాజ్యం తప్పుపడుతోంది. ఇదే అట్లాంటిక్ కూటమి బీటలు వారడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గతంలో అంటే 2018లో నాటో వేదికగా ట్రంప్ చేసిన హెచ్చరికలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. రష్యా ఇంధనంపై ఆధారపడుతూ, మళ్ళీ రష్యా నుండే రక్షణ కల్పించమని అమెరికాను కోరడం హాస్యాస్పదమని అప్పట్లో ఆయన ఎద్దేవా చేశారు. ఆ సమయంలో ఆయన వ్యాఖ్యలను యూరప్ నేతలు కొట్టిపారేసినప్పటికీ, 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ట్రంప్ మాటల్లోని వాస్తవం యూరప్ దేశాలకు అర్దమైనా అర్ధం కాకపోయినా.. ప్రపంచానికి మాత్రం అర్థమైంది. ఇటు వాణిజ్య పరంగా కూడా అమెరికాకు యూరప్ ద్వారా ఏటా వందల బిలియన్ల డాలర్ల లోటు ఏర్పడుతోంది. అంటే ఒకవైపు ఆర్థికంగా అమెరికాను వాడుకుంటూ, మరోవైపు వ్యూహాత్మకంగా అమెరికా శత్రు దేశాలతో స్నేహం చేస్తూ యూరోప్ దేశాలు రెండిందాలా లాభపడటాన్ని అమెరికా సమాజంలో తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది.
భవిష్యత్తులో ఈ సంబంధాలు మెరుగుపడాలంటే కేవలం నాయకుల మార్పు సరిపోదు. యూరప్ తన రక్షణ బాధ్యతలను స్వీకరించడం, వాణిజ్య పరమైన అసమానతలను సరిదిద్దడం వంటి కీలక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కేవలం అమెరికానే అన్నిటికీ బాధ్యత వహించాలనే ధోరణిని వీడి, పరస్పర ప్రయోజనాల ఆధారంగా సంబంధాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాంటిక్ కూటమి మనుగడ సాగించాలంటే వ్యక్తులపై నెపం నెట్టడం కాకుండా.. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడంపైనే దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో, ఈ అంతరాలు మరింత పెరిగి కూటమి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.






