సహాయం ముసుగులో అమెరికా మోసం!

posted on: Jun 23, 2026 5:47PM

1950, 1960 దశకాల్లో భారతదేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న సమయంలో అమెరికా అందించిన పీఎల్-480 గోధుమలు దేశానికి పెద్ద ఊరటనిచ్చాయి. అయితే ఈ సహాయం కేవలం మానవతా దృక్పథంతోనే జరిగిందా? లేక దాని వెనుక అమెరికా ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయా? అనే ప్రశ్న చరిత్రలో ఇప్పటికీ చర్చకు వస్తూనే ఉంది. ఆ చర్చలో వస్తున్న పలు అంశాలు భారత్‌కు ఆందోళనకరంగా మారాయి. 

1954లో అమెరికా ప్రవేశపెట్టిన ప్రపంచ శాంతి కోసం ఆహారం  (Food for Peace Program) పబ్లిక్ లా 480 (PL-480)కింద అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో భారీగా పేరుకుపోయిన వ్యవసాయ మిగులు నిల్వలను వినియోగించడం, రైతులకు మద్దతు ఇవ్వడం, మిత్రదేశాలతో సంబంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది.  భారత్ ఈ పథకం కింద అత్యధికంగా లబ్ధి పొందిన దేశాల్లో ఒకటి. ముఖ్యంగా 1960లలో కర వు పరిస్థితులు నెలకొన్న సమయంలో లక్షల టన్నుల గోధుమలు భారత్‌కు చేరాయి. బయటకు ఇది మానవతా సహాయంలా కనిపించినా, ఆ సహాయం  వెనుక అనేక చీకటి వాస్తవాలు దాగి ఉన్నాయి.

ఆ సమయంలో అమెరికా రైతులు భారీ ఉత్పత్తి చేస్తున్నారు. కానీ అంత పెద్ద పరిమాణంలో దేశీయంగా వినియోగంలేదు. దీంతో గోదాములు ధాన్యంతో నిండిపోయాయి. ఈ మిగులు నిల్వలను విదేశాలకు పంపించడం ద్వారా అమెరికా తన వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలనుకుంది. అదీకాక భారత్‌కు వచ్చిన గోధుమలు అమెరికాలో పశువుల మేతకు ఉపయోగించే నాసిరకం ధాన్యాలు. అమెరికన్లు తినలేని తక్కువ నాణ్యత కలిగిన ఆ ఎర్రటి గోధుములను , భారత్‌కు  సహాయంగా పంపారు.

ఆ పీఎల్ -480 గోధుమ గింజలతో పాటు ..  సాధారణంగా కాంగ్రెస్ గడ్డి లేదా  గాజు పూల మొక్క, ‘వయ్యారిభామ’ అని పిలిచే ప్రమాదకరమైన విదేశీ కలుపు మొక్క  పార్థినియం హిస్టెరోఫోరస్  బీజాలు భారతదేశంలో ప్రవేశించాయి.  పార్థినియం హిస్టెరోఫోరస్ అనేది ఒక ప్రమాదకరమైన, హానికరమైన కలుపు మొక్క. ఇది చాలా వేగంగా వ్యాపించి, పంట పొలాలను, పచ్చిక బయళ్లను నాశనం చేస్తుంది. ఇది ఇతర మొక్కలను పెరగనీయదు. ఈ మొక్క గాలిలో విడుదల చేసే పుప్పొడి,  ఆకుల రసం వల్ల మనుషులలో చర్మ సమస్యలు, ఆస్తమా,   శ్వాసకోశ సమస్యలు వస్తాయి. పశువులు తింటే వాటి ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. లేత ఆకుపచ్చని క్యారెట్ ఆకుల మాదిరిగా ఉండే ఆకులు, చిన్న తెల్లటి పువ్వులను కలిగి ఉండే ఆ కలుపుమొక్కను నియంత్రించే సహజ శత్రువులు.  అప్పట్లో భారత్ పర్యావరణ వ్యవస్థలో లేవు. నేటికీ భారతదేశంలో పార్థీనియమ్ అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్కగా గుర్తిస్తున్నారు. దాని కారణంగా స్థానిక చీడపీడల నియంత్రణ వ్యవస్థ దెబ్బతింది. స్థానిక పర్యావరణ వ్యవస్థలో లేడీబర్డ్ బీటిల్స్ ,  హైమెనోప్టెరన్ కందిరీగలు  సహజ కీటకనాశకాలుగా పని చేస్తాయి. విదేశీ చీడపీడలను ఈ స్థానిక జీవులు నాశనం చేయలేకపోవడంతో , రైతులు మళ్ళీ అమెరికా నుంచి కీటకనాశక రసాయనాలు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అది అమెరికాకు  మరో వ్యాపార అవకాశమైంది.

అంటే పీఎల్ -480 ఒకవైపు సహాయ కార్యక్రమమే అయినప్పటికీ, మరోవైపు అమెరికా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ఎనలేని లాభం చేకూర్చింది. భారత్‌కు మాత్రం కరవు సమయంలో  సహాయం గా నాసిరకం గోధుమలు పంపి తక్షణ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించినట్లు నమ్మకం సంపాదించింది. గోధుమలతో పాటు పార్థీనియమ్ విత్తనాలు, విదేశీ పతంగులు వచ్చి మన దేశంలో  వ్యవసాయ నాశనం మొదలైంది. స్థానిక విత్తన వ్యవస్థ క్రమంగా నాశనమై, దిగుమతి విత్తనాలపై ఆధారపడటం పెరిగింది. అప్పట్లో స్వయంసమృద్ధి సాధించలేని భారత్,  ఆహారధాన్యాల కోసం శాశ్వతంగా పాశ్చాత్య దేశాలపై ఆధారపడే పరిస్థితి నెలకొంది. 

ఏ దేశపు వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ అయినా శతాబ్దాల పరిణామక్రమంలో స్వయంగా సమతుల్యతను సాధిస్తుంది. స్థానిక చీడపీడలకు స్థానిక సహజ శత్రువులు అభివృద్ధి చెందుతాయి. లేడీబర్డ్ బీటిల్స్ మొక్కలకు పట్టే పురుగులను తింటూ సహజ కీటకనాశకాలుగా పనిచేస్తాయి. హైమెనోప్టెరన్ కందిరీగలు  గుడ్లు పెట్టి చీడ లార్వాలను నష్టపరచి పంటలను రక్షిస్తాయి. అమెరికా నుంచి వచ్చిన విదేశీ వైరస్, కలుపు మొక్కలకు భారత పర్యావరణంలో ఇటువంటి సహజ శత్రువులు ఉండేవి కావు. ఫలితంగా అవి విపరీతంగా వ్యాపించాయి. రైతులు ఈ కొత్త ముప్పులను అరికట్టడానికి రసాయన పురుగు మందులు కొనాల్సి వచ్చింది. అవి మళ్ళీ అమెరికా,  పాశ్చాత్య కంపెనీల నుంచే వచ్చాయి. అలా అమెరికా ఒక పరిపూర్ణ వ్యాపార వ్యూహం అమలు చేసింది.

పీఎల్ -480 కార్యక్రమం, దాని పర్యావరణ పరిణామాలు భారత వ్యవసాయరంగాన్ని తీవ్రస్థాయిలో నష్టపరిచాయి. పార్థీనియమ్ వ్యాప్తి వల్ల లక్షలాది ఎకరాల సాగు భూమి దెబ్బతిపి, దిగుబడి తగ్గింది. కొత్త చీడలు, కలుపు నియంత్రణకు రసాయనాలు కొనేందుకు రైతులు అప్పులు చేశారు.శతాబ్దాల స్థానిక గోధుమ రకాలు క్రమంగా కనుమరుగై, దిగుమతి విత్తనాలపై ఆధారపడటం పెరిగింది. స్వయంపోషణ సాధించలేక భారత్ ఆహారం కోసం విదేశాలపై ఆధారపడే దుస్థితి నెలకొంది. వ్యవసాయం ద్వారా జీవనం గడిపే కోట్లాది భారతీయులు దారిద్ర్యంలో ఉండిపోవడానికి ఇది ఒక కారణం. 
పీఎల్ -480 తర్వాత 1960-70ల్లో వచ్చిన 'హరిత విప్లవం'తో భారత్  పైకి స్వయంసమృద్ధి సాధించినట్లు కనిపించింది. కానీ అది కూడా అమెరికా, పాశ్చాత్య వ్యవసాయ కంపెనీల అధిక దిగుబడి విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడింది. ఫలితంగా స్థానిక, సంప్రదాయ విత్తన రకాలు అంతరించిపోయాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల ఖర్చు పెరిగి రైతు రుణభారం అధికమైంది. భూగర్భ జలాలు క్షీణించాయి, నేల సారం తగ్గింది. విత్తన కంపెనీలు, రసాయన కంపెనీల వ్యాపారం విస్తరించింది.

నిజమైన మానవతా సహాయం ఎప్పుడూ స్వావలంబనను బలపరుస్తుంది, కాని పరాధీనతను సృష్టించదు. అయితే పీఎల్-480  కార్యక్రమం,  దాని పర్యావరణ పర్యవసానాలు భారతదేశ వ్యవసాయాన్ని, రైతులను బలహీనపరచాయి. నిజమైన ‘ఫుడ్ ఫర్ పీస్’ ఇలా ఉండాలంటే స్థానిక వ్యవసాయ వ్యవస్థను బలపరచాలి కాని, నాశనం చేయకూడదు. స్వదేశీ విత్తన బ్యాంకులు, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి. జీవ వైవిధ్యం పరిరక్షణలకు కొత్త జీవులను ప్రవేశపెట్టకుండా జాగ్రత్త వహించాలి. రసాయన వ్యవసాయానికి బదులు సహజ, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అసలైన కరువు నిరోధక చర్యలంటే స్థానిక పంటలు పెంచడంలో ఉంది. దిగుమతి ఆహారంపై ఆధారపడడం కాదు.ఒక దేశాన్ని శాశ్వతంగా పేదగా ఉంచాలంటే మిలిటరీ దాడి అక్కరలేదు.  దాని వ్యవసాయ వ్యవస్థను నాశనం చేస్తే సరిపోతుంది. పీఎల్-480 అదే చేసింది. 'సహాయం రూపంలో భారత్‌ వ్యవసాయరంగాన్ని సంక్షోభం లోని నెట్టింది.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

google-ad-img
    Related Sigment News
    • Loading...