Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికా కాల్పులతో వేడెక్కిన రాజకీయం
posted on: Jun 13, 2016 2:48PM
.jpg)
దేశంలో వినాశనం జరిగితే దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే నేతల గురించి కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. కానీ మా అంతటి పెద్దన్నలు లేరని చెప్పుకునే అమెరికాలో సైతం ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తుంటే... ఏ దేశమేగినా నేతలు నీతులు ఒకే రీతిలో ఉంటాయని సర్దిచెప్పుకోవలసిందే! నిన్నటికి నిన్న, అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పులతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. అమెరికా చరిత్రలోనే అరుదైన నరమేధం అంటూ పరామర్శలు వెల్లువెత్తాయి. కానీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ముస్లింల గురించి తాను చేస్తున్న వ్యాఖ్యలకు ఈ ఘటన ఊతం ఇస్తోందంటూ చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా ఒబామా, హిల్లరీ క్లింటన్‌లు ‘ఇస్లామిక్ ఉగ్రవాదం’ అనే పదాన్ని గుర్తించి తీరాలంటూ పట్టుపడుతున్నారు.
ముస్లింలను కొన్నాళ్లపాటు అమెరికాలోకి రాకుండా నిషేధించాలనీ, దేశంలో ఉన్న మసీదులని మూసివేయాలనీ, అమెరికా ముస్లింల మీద ఓ కన్నేసి ఉంచాలనీ... ఇలా ట్రంప్ ఒక దాని తరువాత ఒకటిగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే! మొదట్లో ఈ వ్యాఖ్యలకు అమెరికా జనం పెద్దగా ప్రతిస్పందించలేదు. కానీ పారిస్, బెల్జియం దేశాల్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలను బలపరిచేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఉగ్రవాదుల గురించి పాశ్చాత్యులు భయపడిన ప్రతిసారీ, ఆ భయం ట్రంప్ బలంగా మారుతూ వచ్చింది. మొదట్లో అసలు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షపదవికి పోరాడే అర్హతని సైతం సాధించలేడు అనుకున్న ట్రంప్ ఇప్పుడు... అధ్యక్ష పదవి వైపు దూసుకుపోతున్నాడు. మరోవైపు ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా, ఫ్లోరిడా కాల్పుల తరువాత కాస్త కఠినంగా మాట్లాడక తప్పదు అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకూ ఫ్లోరిడా రాష్ట్రం హిల్లరీ క్లింటన్‌కే అనుకూలంగా ఉంది. అక్కడి ప్రజలను కనుక ట్రంప్ రెచ్చగొట్టి తనవైపుకి తిప్పుకుంటే, హిల్లరీకి తిప్పలు తప్పవు. ఫ్లోరిడా కాల్పులు స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకుంటూ సాగాయి కాబట్టి, వారు కూడా ఇక మీదట ట్రంప్ వ్యాఖ్యలకు ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదం మీద పోరులో ట్రంప్ కథానాయకుడు అని కనుక అమెరికాలోని స్వలింగ సంపర్కులు భావిస్తే, ఓటింగ్ సరళి తారుమారు కాక తప్పదు. ఇన్నేసి భయాలను, భావాలను దృష్టిలో ఉంచుకుని.... హిల్లరీ క్లింటన్ ఎలా స్పందిస్తారో చూడాలి!





