అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా... ఓ తమిళ తంబి

posted on: Feb 15, 2016 9:31AM

అమెరికాలో ఉన్న భారతీయులు కేవలం చిన్నాచితకా స్థానాలతో సరిపెట్టుకోవడం లేదు. తమ ప్రతిభతో దేశంలోనే అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర గవర్నరులుగా, అధ్యక్షునికి సలహాదారుగా, రక్షణ రంగంలో కీలక సభ్యులుగా ఇప్పటికే వారు తామేమిటో నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలోకి మరో పదవి చేరే అవకాశం ఉంది. భారతదేశంలో పుట్టన ‘పద్మనాభన్‌ శ్రీకాంత్‌ శ్రీనివాసన్‌’ అనే తమిళుడు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాసన్‌ చిన్నతనంలోనే అతని కుటుంబం అమెరికాకు వలస వెళ్లిపోయింది. అక్కడే విద్యని పూర్తిచేసుకున్న శ్రీనివాసన్‌, గొప్ప న్యాయవాదిగా పేరు సంపాదించాడు. ఒబామా, జార్జ్‌ బుష్‌ ప్రభుత్వాల తరఫున ఎన్నో క్లిష్టమైన కేసులలో వాదించి ప్రభుత్వానికి మంచి పేరే తీసుకువచ్చారు. శ్రీనివాసన్‌ ప్రతిభను గుర్తించిన ఒబామా ప్రభుత్వం ఆయనను 2013లో కొలంబియాలోని ఒక న్యాయస్థానానికి, జడ్జిగా నియమించింది.

ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో ఉండే తొమ్మిది మంది న్యాయమూర్తులలో ఒకరైనా ‘ఎంటోనియన్‌ స్కాలియా’ అకస్మాత్తుగా మరణించడంతో, ఆ పదవి ఖాళీ అయ్యింది. ఒబామా సర్కారు ఆ పదవికి శ్రీనివాసన్‌ పేరుని సూచించాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వ పంతమే నెగ్గితే కనుక ఆ పదవిని చేపట్టిన తొలి భారతీయునిగా శ్రీనివాసన్ మిగిలిపోతారు. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకాన్ని సాధించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఆ పదవి జీవితకాలం కొనసాగుతుంది. ఆ పదవిలో ఉండే వ్యక్తులు వెలువరించే తీర్పులు దేశప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మరి కొన్ని దశాబ్దాల పాటు అమెరికా ప్రజల జీవితాలని శాసించే ఈ పదవి శ్రీనివాసన్‌ను వరిస్తుందో లేదో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...