Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సముద్ర జలాలపై అమెరికా పట్టు.. .. చైనాకు తప్పని తిప్పలు!
posted on: Apr 16, 2026 2:54PM

ప్రపంచ చమురు రవాణా మార్గాలపై పట్టు సాధించే క్రమంలో అమెరికా తన వ్యూహాలను వేగంగా మారుస్తోంది. ఇప్పటివరకు పశ్చిమ ఆసియాలోని హార్ముజ్ జలసంధిపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు తన ప్రాధాన్యతలను ఆగ్నేయ ఆసియాలోని మలక్కా జలసంధి వైపు మళ్లిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి వెన్నెముకగా నిలిచే ఈ జలసంధిపై పర్యవేక్షణ పెంచడం ద్వారా చైనాకు అందే ఇంధన సరఫరాను నియంత్రించాలన్నది అమెరికా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ వ్యూహాత్మక మార్పులో ఒక కీలక మైలురాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభింస్తుంది. దీనివల్ల మలక్కా జలసంధి గుండా సాగే నౌకాయానాన్ని నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం అమెరికాకు పెరుగుతుంది.
ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆంక్షలు విధించి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా, ఇప్పుడు అదే తరహా ఒత్తిడిని చైనాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మలక్కా జలసంధి భౌగోళికంగా ఎంతో సంక్లిష్టమైనది. కొన్ని చోట్ల దీని వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40 శాతం, సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో 30 శాతం ఈ ఇరుకైన మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా చైనా దిగుమతి చేసుకునే ముడి చమురులో 80 శాతం ఇక్కడి నుంచే వెళ్లాలి. ఒకవేళ ఏదైనా కారణంతో ఈ మార్గం మూసుకుపోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే డేంజర్ ఏర్పడుతుంది. అందుకే దీనిని బీజింగ్ వర్గాలు మలక్కా డైలెమా అంటే మలక్కా చిక్కుముడి అని పిలుస్తాయి.
ఈ సవాలును ఎదుర్కొనేందుకు చైనా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు ద్వారా భూమార్గాలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో ముడి చమురు, సహజ వాయువును రైల్వేల ద్వారా తరలించడం అసాధ్యం. మరోవైపు ఆంక్షలను తప్పించుకోవడానికి షాడో ఫ్లీట్ అంటే గుర్తుతెలియని నౌకల సముదాయం సాయం తీసుకుంటున్నప్పటికీ, అమెరికా నిఘా ముందు అవి ఎంతవరకు నిలుస్తాయనేది ప్రశ్నార్థకమే. చైనా తన పట్టు నిలుపుకోవడానికి ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలతో దౌత్య సంబంధాలను బలపరుచుకోవాలని చూస్తోంది. ఈ భౌగోళిక రాజకీయ యుద్ధంలో భారతదేశం అత్యంత కీలకమైన స్థానంలో ఉంది.
మలక్కా జలసంధికి పశ్చిమ ద్వారంగా పిలిచే అండమాన్ - నికోబార్ దీవులు భారత్‌కు సహజసిద్ధమైన రక్షణ కవచాలు. పోర్ట్ బ్లెయిర్ నుంచి కేవలం 24 గంటల్లోనే మలక్కా జలసంధిని చేరుకునే వీలుండటం భారత్‌కు పెద్ద అడ్వాంటేజ్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా భారత్ ఈ ప్రాంతంలో తన సైనిక, వాణిజ్య ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. ఇక పోతే.. ఈ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించడం అమెరికాకు అంత సులభం కాదు. ఈ మార్గం మెజారిటీ భాగం ఇండోనేషియా, మలేషియా సార్వభౌమత్వంలో ఉంది. తమ ప్రాదేశిక జలాల్లో అగ్రరాజ్యాల ఆధిపత్యాన్ని ఆ దేశాలు సులువుగా అంగీకరించవు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్ అయిన సింగపూర్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దేశాల రాజకీయాలు, ప్రయోజనాలు ఈ సముద్ర వ్యూహ పోరును మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.
రానున్న కాలంలో ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. చైనా తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, అమెరికా విధిస్తున్న నియంత్రణల మధ్య సమతుల్యత దెబ్బతింటే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ ఒక వైపు తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటూనే, మరోవైపు ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడే కీలక శక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది.
-సీతారాం కంఠమనేని






