Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికా డేటా శక్తి పలాంటీర్.. సమాచార విశ్లేషణతో అంతర్జాతీయ భద్రతను శాసిస్తున్న టెక్ దిగ్గజం
posted on: May 15, 2026 3:23PM

నేటి ఆధునిక యుగంలో సమాచారం (డేటా) అనేది అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా మారింది. అయితే కేవలం డేటా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ఆ డేటా వెనుక ఉన్న అర్థాన్ని లేదా గ్రహించగలిగినప్పుడే అది నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది. సరిగ్గా ఈ సూత్రాన్ని నమ్ముకుని, అమెరికా రక్షణ, గూఢచారి వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థే పలాంటీర్ టెక్నాలజీస్. 9/11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా నిఘా వర్గాలపై వచ్చిన ప్రధాన విమర్శ ఏమిటంటే.. వారి వద్ద డేటా అంటే సమాచారం లేకపోవడం కాదు, ఉన్న సమాచారాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించే గ్రాహణశక్తి లేకపోవడం.
విభిన్న విభాగాల్లో ఉన్న డేటాను ఏకీకృతం చేసి, రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టేలా చేయడంలో పలాంటీర్ ఒక శక్తిమంతమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లా పనిచేస్తోంది. పలాంటీర్ ప్రస్థానం 9/11 దాడుల తర్వాత ప్రపంచానికి తెలిసినప్పటికీ.. దీని అసలు మూలాలు పేపాల్ సంస్థలో జరిగిన ఒక ఆర్థిక యుద్ధంలో ఉన్నాయి. పేపాల్ ప్రారంభ రోజుల్లో రష్యన్ హ్యాకర్లు దొంగిలించిన క్రెడిట్ కార్డుల ద్వారా నెలకు సుమారు 10 మిలియన్ డాలర్ల వరకు దోచుకునేవారు. ఇంజినీర్లు ఎన్ని కఠినమైన నియమాలు రూపొందించినా.. మోసగాళ్లు వాటిని అధిగమిస్తూ ఉండేవారు. ఆ సమయంలో మాక్స్ లెవ్‌చిన్ అనే నిపుణుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. కేవలం యంత్రాలపై ఆధారపడకుండా.. డేటాను మనుషులు సులభంగా విశ్లేషించేలా ఇగోర్ అనే టూల్‌ను రూపొందించారు.
ఇది అనుమానాస్పద లావాదేవీలను హైలైట్ చేసి చూపడం వల్ల మానవ విశ్లేషకులు మోసాలను 70 శాతం వరకు తగ్గించగలిగారు. ఇదే మోడల్ భవిష్యత్తులో పలాంటీర్ నిర్మాణానికి పునాదిగా మారింది. పీటర్ థీల్ ఈ పేపాల్ ఫ్రాడ్ సమస్యకు, అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యానికి మధ్య ఉన్న పోలికను గుర్తించారు. పేపాల్ వద్ద ఉన్నట్లే సీఐఏ, ఎఫ్ బీఐ, ఎన్ఎస్ఏ వంటి సంస్థల వద్ద అపారమైన డేటా ఉన్నప్పటికీ, అవి వేర్వేరు విభాగాల మధ్య ఉండటం వల్ల పూర్తి చిత్రాన్ని చూడలేకపోయారు. ఈ లోటును పూడ్చేందుకు 2003లో పీటర్ థీల్, అలెక్స్ కార్ప్ కలిసి పలాంటీర్ టెక్నాలజీస్‌ను ప్రారంభించారు.
మొదట్లో సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు దీనిని ప్రభుత్వం కోసం చేసే ఒక మొండి సాఫ్ట్‌వేర్‌గా భావించి తిరస్కరించారు. కానీ పలాంటీర్ వ్యూహాత్మకంగా సీఐఏకు చెందిన ఇన్-క్యూ-టెల్ నుండి పెట్టుబడిని సేకరించడం ద్వారా దాని విశ్వసనీయతను పెంచుకుంది. పలాంటీర్ విజయానికి ప్రధాన కారణం వారి ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీర్ మోడల్. సాధారణ సాఫ్ట్‌వేర్ కంపెనీలలా కాకుండా.. వీరి ఇంజినీర్లు నేరుగా యుద్ధభూమిలోకి లేదా క్లయింట్ కార్యాలయాలకు వెళ్లి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి కోడింగ్ రాస్తారు.
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల సమయంలో అమెరికా సైనికులు ఐఈడి బాంబుల వల్ల భారీగా ప్రాణాలు కోల్పోయేవారు. పలాంటీర్ రూపొందించిన గాథమ్'ప్లాట్‌ఫాం ద్వారా బాంబు దాడులు జరిగిన ప్రదేశాలు, అనుమానితుల ఫోన్ నంబర్లు, సమయాలను ఒకే మ్యాప్‌పై విశ్లేషించడం ప్రారంభించారు. దీనివల్ల బాంబు తయారీదారులను గుర్తించడం సులభమైంది. అలాగే.. దాడుల గుర్తింపు రేటు 12 శాతం పెరిగింది. ప్రపంచాన్ని కుదిపేసిన ఒసామా బిన్ లాడెన్ వేటలో కూడా పలాంటీర్ కీలక పాత్ర పోషించింది. మిలియన్ల కొద్దీ నిఘా కేబుళ్లు, శాటిలైట్ చిత్రాలు, ఆడియో రికార్డింగ్‌లను విశ్లేషించి, అల్ ఖైదా నెట్‌వర్క్‌లోని కీలక వ్యక్తులను ట్రాక్ చేయడంలో గాథమ్ సాఫ్ట్‌వేర్ సహాయపడిందని పరిశీలకులు చెబుతారు.
కేవలం ఉగ్రవాద వ్యతిరేక పోరాటమే కాకుండా, కోవిడ్ వ్యాప్తిని అరికట్టడం, ఆర్థిక మోసాలను కనిపెట్టడం, సప్లై చైన్ నిర్వహణ వంటి సమయాల్లో పలాంటీర్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుని శక్తిమంతమైన సంస్థలతో సంబంధాలను పటిష్టం చేసుకుంది.
పలాంటీర్ వ్యూహం నుండి ప్రపంచానికి మూడు ప్రధాన పాఠాలు అందుతున్నాయి. మొదటిది, కృత్రిమ మేధ, మనుషులను భర్తీ చేయడం కాదు, వారిని సూపర్ హ్యూమన్ అనలిస్టులుగా మార్చడమే లక్ష్యంగా ఉండాలి. యంత్రాలు విచిత్రమైన డేటా క్లస్టర్లను గుర్తిస్తే, మనుషులు వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని నిర్ణయిస్తారు. రెండవది.. సాఫ్ట్‌వేర్ రూపకల్పన అనేది ఏసీ గదుల్లో కూర్చుని చేసేది కాదు.. కస్టమర్ పక్కన కూర్చుని వారి పని విధానాన్ని అర్థం చేసుకుని చేయాలి. మూడవది.. వందల మంది సామాన్య కస్టమర్ల కంటే, మార్కెట్‌లో తలుపులు తెరవగల ఒకే ఒక్క లెజెండరీ కస్టమర్ ఉండటం స్టార్టప్‌లకు ఎంతో మేలు చేస్తుంది. భారతదేశం వంటి దేశాలకు కూడా పలాంటీర్ ప్రస్థానం కొన్ని కీలక ప్రశ్నలను మిగిలిస్తోంది. మన సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత, నేరాల నియంత్రణ కోసం వివిధ విభాగాల డేటాను అనుసంధానించే సమగ్ర ప్లాట్‌ఫాం అవసరం ఎంతైనా ఉంది. అయితే, ఇటువంటి ప్లాట్‌ఫాంలు ప్రైవసీ మరియు పౌర హక్కులకు భంగం కలగకుండా ఎలా పనిచేస్తాయనేది కూడా చర్చించాల్సిన అంశం. జాతీయ భద్రత, రాజ్యాంగ పరిమితుల మధ్య సమతుల్యతను కాపాడుతూ ఇటువంటి స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం నేటి అవసరం.
డేటా యుగంలో కేవలం సమాచారం ఉన్నవాడు శక్తిమంతుడు కాదు, ఆ సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోగలిగిన వాడే అసలైన విజేత. అమెరికాకు ఒక బలమైన శక్తిగా నిలిచిన పలాంటీర్, భవిష్యత్తులో గ్లోబల్ జియోపాలిటిక్స్, సైబర్ యుద్ధతంత్రాన్ని ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజాస్వామ్య దేశాలు ఇటువంటి సాంకేతికతను పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఎలా ఉపయోగించుకుంటాయనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





