విమర్శల నుంచి ప్రశంసల వరకూ.. అమెరికాతో ఇండియా వ్యూహాత్మక బంధం

posted on: May 11, 2026 3:36PM

అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ అమెరికా  మధ్య అనుబంధం ఒక కీలక మలుపునకు చేరుకుంది. గడిచిన కొద్ది నెలలుగా వాషింగ్టన్ నుండి వెలువడుతున్న సంకేతాలను గమనిస్తే, భారత్ పట్ల అమెరికా తన ప్రాధాన్యతలను,  వైఖరిని స్పష్టంగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు విమర్శలు చేసిన నోళ్లే నేడు భారత్‌ను ప్రపంచ గమనాన్ని నిర్దేశించే శక్తిగా ప్రశంసించడం గమనార్హం. ముఖ్యంగా 2026 మార్చిలో మొదలైన చిన్నపాటి దౌత్యపరమైన వివాదం నుండి మే నెలలో కుదిరిన భారీ ఆర్థిక ఒప్పందాల వరకు జరిగిన పరిణామాలు ఈ రెండు దేశాల బంధం ఎంత దృఢంగా మారుతున్నదో స్పష్టం చేస్తున్నాయి.  

గత మార్చిలో అమెరికాకు చెందిన ఉన్నతాధికారి క్రిస్టోఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొంత ఉత్కంఠను రేకెత్తించాయి. గతంలో చైనాకు ఇచ్చిన అపరిమిత రాయితీలు ఆ దేశాన్ని ఒక శక్తిమ్తమైన ప్రత్యర్థిగా మార్చాయనీ..  అటువంటి  చైనా తప్పును భారత్ విషయంలో పునరావృతం చేయబోమని  క్రిస్టోఫర్ లాండౌ పేర్కొన్నారు. అంటే భారత్‌కు ఇచ్చే ప్రోత్సాహకాలపై ఆంక్షలు ఉంటాయనే  సంకేతాలను ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. భారత్ అభివృద్ధి అనేది తన సొంత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందనీ.. ఇతర దేశాల అంతర్గత వ్యూహాలు లేదా గత తప్పులు భారత సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేయలేవని  కుండబద్దలు కొట్టారు.  

రాజకీయంగా ఇటువంటి వాదోపవాదాలు నడుస్తున్నప్పటికీ..  ఆర్థిక రంగంలో  భారత్ తన సత్తా చాటుతోంది.చాటుతూనే ఉంది.  ఈ ఏడాది మేలో అమెరికాలో నిర్వహించిన  సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భారతీయ సంస్థలు అద్భుతమైన ప్రతిభను కనబరిచాయి. అమెరికా గడ్డపై సుమారు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు భారత కంపెనీలు ముందుకు రావడం ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది. ఈ పెట్టుబడుల ద్వారా అమెరికాలోని టెక్సాస్, న్యూజెర్సీ వంటి ప్రధాన రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా.. భారత ఆర్థిక బలం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి నిరూపితమైంది.  

ఈ  పెట్టుబడుల్లో అత్యధిక భాగం ఫార్మా రంగానికి చెందడం విశేషం. మొత్తం పెట్టుబడిలో 19.1 బిలియన్ డాలర్లు కేవలం ఔషధ రంగం నుండే రాగా, ఇందులో సన్ ఫార్మా వంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు వ్యవస్థలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో భారత్ ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అగ్రరాజ్యంలో తయారీ రంగాన్ని బలోపేతం చేస్తూనే..  భారత కంపెనీలు అక్కడ తమ ఉనికిని చాటుకోవడం ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక ఏకీకరణ మరింత లోతుగా పాతుకుపోయింది.  భారతదేశ ఆర్థిక శక్తిని చూసిన తర్వాత అమెరికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. 

ఈ మార్చిలో విమర్శలు చేసిన అదే క్రిస్టోఫర్ లాండౌ..  మే నాటికి స్వరం పూర్తిగా మార్చేశారు.  భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. 21వ శతాబ్దాన్ని తీర్చిదిద్దే బాధ్యత భారత్‌పైనే ఉందనీ.. ఈ ప్రయాణంలో అమెరికా భాగస్వామి కావాలని ఆశిస్తోందనీ  ట్రంప్ పేర్కొన్నారు.  అమెరికాలోని దాదాపు 50 రాష్ట్రాలలో  భారతీయ ప్రత్యక్ష పెట్టుబడులు విస్తరించి ఉండటం,  భారత ఆర్థిక సార్వభౌమత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇది 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని చేరుకోవడానికి బలమైన పునాదిగా మారుతుంది.  మొత్తానికి, భారత్ తన  వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి ని ఏమాత్రం వదులుకోకుండానే అగ్రరాజ్యంతో సమాన స్థాయిలో బంధాన్ని కొనసాగిస్తోంది. అమెరికా తన చైనా విధానంలోని వైఫల్యాలను భారత్‌కు అన్వయించాలని ప్రయత్నించినప్పటికీ.. భారత మార్కెట్ సామర్థ్యం,  స్థిరత్వం అందుకు అవకాశం ఇవ్వలేదు. భవిష్యత్తులో భారత్ కేవలం ఒక భాగస్వామిగానే కాకుండా.. ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను శాసించే ఒక నిర్ణయాత్మక శక్తిగా ఇండియా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే దశాబ్దాల్లో భారత్, అమెరికా సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి
 

google-ad-img
    Related Sigment News
    • Loading...