మానవత్వం ముందు తలొంచిన మొంథా తుపాను
posted on Oct 29, 2025 10:52AM
.webp)
ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన పెను తుపాను మొంథాను ఓ యువకుడు అత్యంత ధైర్యసాహసాలతో ఎదుర్కొన్నాడు. మానవత్వంతో స్పందించి, ప్రాణాలను కాపాడాలన్న సంకల్పం ఉంటే.. పెను తుపాను కూడా తలవొంచక తప్పదని నిరూపించాడు. ఇంతకీ విషయమేంటంటే.. భీకర తుపాను ప్రభావంతో అత్యంత భారీ వర్షం, పెనుగాలుల నడుమ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం ఉయ్యాలవాడలో ఓ మహిళ ప్రసవ వేదనతో బాధపడుతోంది. ఆమె పేరు అనిత.. బయట హోరు వాన, లోపల పురిటినొప్పుల యాతన.. ఈ పరిస్థితుల్లో 108 సిబ్బంది తక్షణమే స్పందించారు. ఆ మహిళను అంబులెన్స్ లోకి చేర్చి.. ఆస్పత్రికి తరలించడానికి వాయువేగంతో కదిలారు. అయితే ప్రకృతి వారి ప్రయత్నానికి అడ్డంకిగా నిలిచింది. భారీ వర్షానికి మార్గమధ్యంలోని గెడ్డ వాడు ఉప్పొంగి, ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ ప్రవాహవేగంలో వాహనం నడపడం సాధ్యం కాదు. దాంతో 108 వాహనం నిలిచిపోయింది. ఆ సమయంలో ఆపద్భాంధవుడిగా కదిలాడు.. 108 వాహనంలో సిబ్బందిగా ఉన్న సురేష్ అనే యువకుడు.
వాగు ఉధృతికి వాహనం ముందుకు కదలని పరిస్థితి ఉన్నా లెక్క చేయలేదు. పురిటి నోప్పులతో అల్లాడుతున్న మహిళను భుజానికెత్తుకుని.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుకు ఎదురెళ్లాడు. ప్రవాహ వేగాన్ని లెక్క చేయకుండా ఆ మహిళను వాగుదాటించాడు. ఆమెను సురక్షితంగా ఆస్పత్రికి చేర్చాడు. అక్కడ ఆమె ప్రసవించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఓ మహిళను, ఆ మహిళ గర్భంలోని బిడ్డను కాపాడిన సురేష్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సురేష్ సాహసం ముందు, అతడి మానవత్వం ముందు పెను తుపాను తలవొంచింది.