అంబటిపై మరో పీటీ వారెంట్

posted on: Feb 11, 2026 7:34PM

 

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. సత్తెనపల్లిలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్ల విక్రయాలు జరిగాయి. సచివాలయ వలంటీర్స్ ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు జరిగాయి.  2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్లు అమ్మకాలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు సబ్ కోర్టును ఆశ్రయించారు. 

కోర్టు ఆదేశాలతో అంబటి రాంబాబుపై 2023 జనవరి 16న సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ లక్కీ డ్రా కేసులో తాజాగా పీటీ వారెంట్ జారీ అయింది. మూడు రోజుల క్రితం కూడా అంబటి రాంబాబుకు సంబంధించిన మరో కేసులో కూడా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన అంబటి.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దానిపై పోలీసులు వేసిన పీటీ వారెంట్‌ను కోర్టు కొట్టి వేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌నూ కొట్టివేసింది.  

ఆ క్రమంలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో అప్పటికే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటికి గుంటూరు ఎక్సైజ్ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పట్టభిపురం పోలీసులు దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు సంబంధించి కూడా ఆయనకు బెయిల్ వచ్చింది. ప్రస్తుతం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి.. గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో సత్తెనపల్లి పోలీసులు మరో పీటీ వారెంట్ దాఖలు చేయడం గమనార్హం.

google-ad-img
    Related Sigment News
    • Loading...