తప్పులెన్ను వారు తమతప్పులెరుగరయా?

posted on: Aug 13, 2026 4:26PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి వింతగా విడ్డూరంగా ఉంది. అసలు మొదటి నుంచి రాష్ట్ర రాజధాని విషయంలో ఆ పార్టీకి ఒక నిర్దుష్ఠ అభిప్రాయం, విధానం ఉన్నట్లు కనిపించదు. పదే పదే మాట మారుస్తూ మడమ తిప్పుతూ వైసీపీ ప్రతిష్ఠను మసకబార్చుకుంది. 2014లో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన వైపీపీ, ఆ పార్టీ అధినేత జగన్.. ఆ తరువాత అధికారంలోకి రాగానే మాట మార్చారు. మూడు రాజధానులంటూ పవర్ లో ఉన్న ఐదేళ్లూ మూడుముక్కలాట ఆడారు. ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయకుండానే గడిపేశారు. న్యాయరాజధాని, శాసన రాజధాని, అడ్మినిస్ట్రేటివ్ రాజధాని అంటూ కబుర్లతో కాలక్షేపం చేసి రాష్ట్రాన్ని రాజధాని లేని అనాథగా మార్చారు. ఇప్పుడు అనూహ్య వేగంతో రాజధాని పనులు జోరుగా సాగుతున్న వేళ.. విమర్శలకు దిగుతూ.. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్న వేమన పద్యాన్ని గుర్తుకు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. 

సరే  ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధాని అమరావతి అన్న చట్టబద్ధత సాధించింది. ఇందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ఆమోందం పొందడంతో.. అమరావతి విషయంలో ఇక అడ్డంకులు, చిక్కులూ పూర్తిగా తొలగిపోయినట్లైంది. అయితే జగన్ అండ్ కో మాత్రం అమరావతి క్రెడిట్ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దక్కుతుందన్న ఆక్రోశంతో కొత్త కొత్త పేర్లతో, వింత వింత ప్రతిపాదనలతో జనంలో కన్ఫ్యూజన్ సృష్టించడానికి విఫలయత్నాలు మాత్రం కొనసాగిస్తునే ఉన్నారు. ఆ క్రమంలో తాము ఔనన్నదే కాదంటూ.. కాదన్నదే ఔనంటూ ఉన్న కొద్ది పాటి ప్రతిష్టనూ మంటగలుపుకుంటున్నారు. 

జగన్ మావిగన్ ప్రతిపాదనా, మావిగన్ నినాదమే 2029 ఎన్నికలలో వైసీపీ అజెండా అని  ప్రకటించి అమరావతి విషయంలో తమ అయిష్టతను విస్పష్టంగా చాటుకున్నారు. ప్రజా ఆకాంక్షలతో తనకు ఇసుమంతైనా సంబంధం లేదనీ మావిగన్ ప్రతిపాదనతో  జగన్ మరో సారి రుజువు చేసుకున్నారు. మావిగన్ ప్రకటనతో వైసీపీ విధానమైన మూడు రాజధానుల సిద్ధాంతానికి వైసీపీ తిలోదకాలిచ్చేసింది. ఇప్పుడు తాజాగా అమరావతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ వేళ ఆ పార్టీ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, వెళ్లగక్కిన అక్కసు.. ఆ పార్టీకి ఒక విధానమంటూ లేదా అన్న సందేహాలు కలిగేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును ఇలా చంద్రబాబు ప్రారంభించారో లేదో.. అలా మీడియా ముందుకు వచ్చిన పేర్ని నాని.. చంద్రబాబును ఉద్దేశించి వేసిన ప్రశ్నలు, చేసిన విమర్శలూ విస్మయం గొలుపుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలను చంద్రబాబుకు ఆపాదించి.. తమ పార్టీ అధినేత జగన్ నే నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి. 

  అమరావతి, సీడ్ యాక్సిస్ రోడ్‌ మొదలు పెట్టి ఎన్నేళ్ళయింది? ఒక రోడ్డు, ఒక  బ్రిడ్జి నిర్మించి  గొప్ప ఘనకార్యంగా చెప్పుకుంటున్నారు అంటూ విమర్శించిన పేర్ని నానికి అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు జాప్యం అవ్వడానికి కారణమేంటో తెలియదని ఎవరైనా ఎలా అనుకుంటారు. ఆ రోడ్డు పూర్తి కాకుండా అడ్డుకోవడానికి 65 సెంట్ల భూమి విషయంలో కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నదెవరు? అని ఎవరైనా ప్రశ్నిస్తూ.. జవాబు జగన్ అని వస్తుందని పేర్ని నానికి తెలియదనుకోవాలా? 

అక్కడితో ఆగలేదు.. 65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి? ఒరిగిందేంటి?   అమరావతి రైతులను ఎంతగా వేధించారో, అవమానించారో, అవహేళన చేశారో  అందరికీ తెలిసిందే.   

అవన్నీ పక్కన పెడితే.. వచ్చే ఎన్నికలలో వైసీపీ  గెలిచి మళ్ళీ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారనీ, అప్పుడు.. మావిగన్‌ రాజధానిగా చేసుకొని పాలిస్తామని చెప్పుకుంటున్న వైసీపీ.. యాక్సిస్ రోడ్డుపైనా, చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించడం దేనికీ?  మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారన్న విశ్వాసం లేకపోవడం వల్లేనా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  మొత్తం మీద పేర్ని నాని రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ అయోమయాన్నీ, ఆ పార్టీలో ఉన్న గందరగోళాన్ని తన ప్రెస్ మీట్ ద్వారా మరోసారి బయటపెట్టారు. 

Amaravati Seed Access Road,  CM CBN,  Perninani, Undavalli Steel Bridge, AP Capital Development 

google-ad-img
    Related Sigment News
    • Loading...