జగన్ తో అమరావతి రైతుల భేటీ.. ట్విస్ట్ ఏంటో తెలుసా?

posted on: Jun 3, 2026 11:24AM

అమరావతి రైతులు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారన్న వార్త సంచలనం సృష్టించింది. నిన్నమొన్నటి వరకు జగన్ ను, ఆయన మూడు రాజధానుల సిద్ధాంతాన్నీ తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకించిన వారే  నేడు తమ సమస్యల పరిష్కారం కోసం అదే గడప తొక్కడం ఏంటన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి.

వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు సుదీర్ఘ కాలం పాటు రోడ్లెక్కి నిరసనలు ప్రదర్శించారు. జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది. 

 తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం (జూన్ 2) జగన్- అమరావతి రైతుల భేటీ జరిగింది. అయితే..  గతంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా   సుదీర్ఘ  పోరాటాలు, పాదయాత్రలు చేసిన పాత అమరావతి రైతుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ భేటీలో లేరు. వీరంతా  ‘కొత్త రైతులు’   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నూతనంగా భూములు కోల్పోతున్న కొందరు రైతులకు ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు అందుకున్న రైతుల్లో కొందరు  తమకు  అన్యాయం జరుగుతోందంటూ  జగన్ వద్దకు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ లోపలా, వెలుపలా గళం విప్పాలని.. తమ పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వంపై పోరాడాలని వారు జగన్ ను కోరారు.  వీరిలో అత్యధికులు నాడు భూ సమీకరణను వ్యతిరేకించిన వారే కావడం గమనార్హం. మొత్తం మీద కొత్త రైతులకు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...