Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీ కేపిటల్ అమరాతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
posted on: Apr 7, 2026 6:39AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సందిగ్ధతకు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతిని రాజధానిగా ధ్రువీకరిస్తూ చేసిన సవరణ బిల్లును పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఉభయ సభలలో కూడా ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ ప్రక్రియలో భాగంగా, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కీలక అంశాలకు సవరణలు చేశారు. ముఖ్యంగా చట్టంలోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ (2)లో ఉన్న మార్పులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
గతంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో "కొత్త రాజధాని ఉండేది. ఇప్పుడు ఆ పదాన్ని తొలగించి, దాని స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది అని స్పష్టంగా పొందుపరిచారు. ఈ మార్పు ద్వారా 'అమరావతి' అనే పదానికి చట్టపరమైన నిర్వచనాన్ని కూడా ఇచ్చారు. సీఆర్డీయే చట్టం 2014 నిబంధనల ప్రకారం నోటిఫై చేయబడిన ప్రాంతాలన్నీ అమరావతి కిందకు వస్తాయని గెజిట్‌లో స్పష్టం చేశారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సవరణ చట్టం 2024 జూన్ 2వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లుగా కేంద్రం పేర్కొంది. అంటే, సాంకేతికంగా 2024 జూన్ 2 నుంచే అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టపరమైన గుర్తింపు పొందింది. ఈ గెజిట్ ప్రచురణతో ఇకపై రాజధాని విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. గత కొన్నేళ్లుగా రాజధాని అంశంపై నెలకొన్న రాజకీయ మరియు న్యాయ పోరాటాలకు ఈ గెజిట్ ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధత లభించడంతో, రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల సమీకరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ గెజిట్ పునాదిగా నిలవనుంది. అంతర్జాతీయ సంస్థల నుండి పెట్టుబడులు ఆకర్షించడానికి, కేంద్ర సహాయ సహకారాలు పొందడానికి ఈ చట్టబద్ధత ఎంతో దోహదపడనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్రం రాజధాని అభివృద్ధికి ఎటువంటి కార్యాచరణను రూపొందిస్తుందో చూడాలి.






