Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భోగాపురం ఎయిర్‌పోర్ట్... ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు నాంది : సీఎం చంద్రబాబు
posted on: Aug 1, 2026 1:07PM
.webp)
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు మణిహారమని పేర్కొన్న చంద్రబాబు... "ఎర్రబస్సు కూడా రాదన్నారు... ఇప్పుడు ఎయిర్‌బస్ వచ్చింది" అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని అడ్డుకున్నవారే ఇప్పుడు రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు.
అల్లూరి సీతారామరాజు పేరు తలుచుకుంటే గుండె ఉప్పొంగుతుందని... ఆయన పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన జీఎంఆర్ సంస్థ ఈ ఎయిర్‌పోర్టును నిర్మించడం విశేషమని... మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషిని కూడా గుర్తు చేశారు.
విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందించారని చంద్రబాబు పేర్కొన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని... 2028 నాటికి అమరావతి తొలి దశను కూడా ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడించారు.
విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నామని... శంషాబాద్ ఎయిర్‌పోర్టు తెలంగాణ దశ, దిశను మార్చినట్లే భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చబోతుందని సీఎం అన్నారు.
గత రెండేళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని... ఇవి పూర్తైతే 5.57 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో రూ.2,784 కోట్లతో ఎనిమిది ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని... 65 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజీకి క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. ఈ నెల 14న గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకొస్తామని, వంశధార–గోదావరి అనుసంధానాన్ని కూడా చేపడతామని ప్రకటించారు.
ఉత్తరాంధ్రలో పర్యాటకం, ఫార్మా, జాతీయ రహదారులు, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి అపార అవకాశాలు ఉన్నాయని... త్వరలో ఉత్తరాంధ్రకు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Alluri Sitarama Raju International Airport, Nara lokesh, Andhra Pradesh Aviation, Bhogapuram Airport, Prime Minister Narendra Modi, CM Chandrababu, Deputy CM Pawan Kalyan, Alluri Sitarama Raju International Airport, AP Development Projects



.webp)


