సాఫ్ట్ కోర్ వెబ్ సిరీస్‌లు.. సైకలాజికల్ వార్‌ఫేర్ ఆరోపణలు!

posted on: May 18, 2026 4:50PM

మలయాళ డిజిటల్ వినోద రంగంలో మరీ ముఖ్యంగా ఓటీటీల్లో.. ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని సాఫ్ట్ కోర్, అడల్ట్ వెబ్ సిరీస్‌లు సరికొత్త సామాజిక చర్చకు తెరలేపాయి. ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారమయ్యే కంటెంట్‌లో హిందూ మతానికి సంబంధించిన సాంప్రదాయ పేర్లు, పవిత్రమైన పండుగలు, పవిత్ర చిహ్నాలతో పాటు ప్రత్యేక పాత్రల రూపకల్పన  విరివిగా జరుగుతోందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ప్రధానంగా ఇతర మతాల నేపథ్యం కలిగిన కొందరు నటీమణులు తెరపై హిందూ పేర్లతో గుర్తింపు పొందుతూ..  సాంప్రదాయ చిహ్నాలతో కనిపించడం వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో  విస్తృతంగా సాగుతోంది. ఈ పరిణామాలను కొందరు సామాజిక విశ్లేషకులు కేవలం వ్యాపార బ్రాండింగ్ వ్యూహంగా కొట్టిపారేస్తుంటే..  మరికొందరు దీనిని ఒక వర్గంపై జరుగుతున్న మానసిక దాడిగా అభివర్ణిస్తున్నారు.  ఈ వివాదాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే కేరళలో దశాబ్దాలుగా ఉన్న సాఫ్ట్-కోర్ సినిమా చరిత్రను పరిశీలించాల్సి ఉంటుంది. 

గత దశాబ్దంలో అంటే 1980, 1990 ల కాలంలోనే మలయాళ చిత్ర పరిశ్రమలో  మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు సమాంతరంగా వయోజనుల కంటెంట్‌కు ఒక ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఆ రోజుల్లో వచ్చిన  ఊత్యాన్,  ధూమం,  ఆదిపాపం,  లయనం  వంటి ప్రయోగాత్మక చిత్రాలు ఈ తరహా చిత్రాలకు ఉన్న మార్కెట్ ను  నిరూపించాయి.  కథా బలం, సంభాషణల కంటే కేవలం శృంగారభరితమైన దృశ్యాలు, నిషిద్ధ అంశాల చుట్టూ తిరిగే కథనాలే ఈ చిత్రాల విజయ రహస్యాలుగా నిలిచాయి. ఆ  తరువాత 2000 సంవత్సరంలో  వచ్చిన  కిన్నరతుంబికల్ అనే చిత్రం అత్యల్ప బడ్జెట్‌తో నిర్మితమై ఊహించని రీతిలో భారీ వసూళ్లను సాధించి..  ఒక నటిని దక్షిణ భారతదేశంలోనే ఈ రంగానికి ఐకాన్‌గా మార్చేసింది. ఆ కాలంలో మార్కెట్ డిమాండ్‌ను బట్టి అనేక చిత్రాలు వయోజన కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  సినిమా రంగంలో నటీనటులు తమ అసలు పేర్లను మార్చుకుని సరికొత్త తెరపేర్లతో రావడం అనేది భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రారంభం నుండి  సంస్కృతే. గతంలో ఎందరో ప్రముఖ నటీనటులు ఉచ్చారణ సౌలభ్యం కోసం, గ్లామర్ కోసం, మార్కెట్ అంగీకారం కోసం తమ మతపరమైన పేర్లను మార్చుకుని సరికొత్త గుర్తింపుతో చిత్రసీమలో రాణించారు. అయితే ప్రస్తుతం కేరళ డిజిటల్ రంగంలో కొందరు నటీమణులు ముస్లిం నేపథ్యం కలిగి ఉండి, తెరపై హిందూ కుటుంబాల ఇళ్లకు సంబంధించిన ప్రత్యేక ఇంటిపేర్లతో చలామణి అవుతుండటం కొత్త అనుమానాలకు తావిచ్చింది. 

ఈ రకమైన కొన్ని వ్యక్తిగత కేసులను,  మీడియా నివేదికలను ఆధారంగా చేసుకుని, దీనిని ఒక నిర్దిష్ట సమాజం మొత్తం కలిసి చేస్తున్న వ్యవస్థీకృత కుట్రగా ముద్రవేయడం సరైన సాక్ష్యాలు లేని సాధారణీకరణ అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక సాంకేతికత పెరిగి  ప్రస్తుత ఓటీటీ యుగంలో పాత తరం థియేటర్ ఆధారిత మార్కెట్ స్థానంలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ఆధారిత యాప్‌లు పుట్టుకొచ్చాయి. యెస్మా, సిగ్మా, ఎన్ఎమ్ఎక్స్ వంటి మలయాళ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వయోజనుల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి. అయితే ఈ సంస్థల పేర్లలో, అలాగే వారు రూపొందించే వెబ్ సిరీస్ టైటిల్స్‌లో సంస్కృత లేదా హిందూ ధ్వని గల పదాలను ఎంచుకోవడం వివాదాస్పదంగా మారింది. 

మరీ ముఖ్యంగా కేరళ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే  విషు  వంటి సాంప్రదాయ పండుగ పేరును వయోజన కంటెంట్ బ్రాండింగ్ కోసం వాడటం అక్కడ   తీవ్ర అసహనానికి, సాంస్కృతిక వేదనకు కారణమవుతోంది. స్థానిక సంస్కృతిని క్యాచీ టైటిల్స్‌గా వాడుకునే మార్కెటింగ్ ధోరణిగా దీనిని కొందరు సమర్థిస్తున్నప్పటికీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.  దీనికి అదనంగా..  సదరు వెబ్ సిరీస్‌లలోని పాత్రలకు సాంప్రదాయ దుస్తులు, బొట్టు, సింధూరం, మంగళసూత్రం వంటి పవిత్ర ఆభరణాలను ధరింపజేసి చూపించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇల్లాలు, ట్యూషన్ టీచర్,  హాస్టల్ వార్డెన్ వంటి పాత మూస పాత్రల చుట్టూ పురుష వీక్షకుల ఫాంటసీలను సృష్టించే క్రమంలో ఈ విధమైన వస్త్రధారణను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా హిందూ మహిళల సాంప్రదాయ ప్రతిరూపాన్ని నిరంతరం సెక్సువలైజ్ చేయడం వల్ల సమాజంలో సదరు మహిళల పట్ల ప్రతికూల ముద్ర పడే ప్రమాదం ఉందన్న  వాదన బలంగా వినిపిస్తోంది.  అయితే.. దీని వెనుక ఒక వ్యవస్థీకృత,  సిద్ధాంతపరమైన ప్రణాళిక ఉందనడానికి ఎటువంటి  ఆధారాలు లేవంటున్నారు నిపుణులు. 

 ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ, పాలనాపరమైన కోణాలు కూడా చర్చకు వస్తున్నాయి. కేరళలోని స్థానిక ప్రభుత్వాల భావజాలం కారణంగానే ఇటువంటి సాంస్కృతిక ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నప్పటికీ, వాస్తవానికి డిజిటల్ కంటెంట్, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నియంత్రణ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐటీ నిబంధనల ప్రకారం కొన్ని అశ్లీల ఓటీటీ యాప్‌లను నిషేధించినప్పటికీ, అవి సరికొత్త డొమైన్‌లు, టెలిగ్రామ్ ఛానెల్‌ల ద్వారా సాంకేతికంగా మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇది డిజిటల్ రంగంలో నిరంతరం సాగే సాంకేతిక సవాలుగా మారింది. అందువల్ల నియంత్రణ అనేది కేవలం పేర్ల ఆధారంగా కాకుండా అశ్లీలత, మైనర్ల రక్షణ,  చట్టపరమైన ప్రమాణాల ప్రాతిపదికన జరగాల్సిన అవసరం ఉంది.  

మరోవైపు, దేశంలోని కొన్ని ప్రముఖ సాంస్కృతిక సంస్థలు, ప్రజాప్రతినిధులు ఓటీటీ నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున చట్టపరమైన పోరాటాలు లేదా నిరసనలు జరగకపోవడం గమనార్హం. అయితే ప్రజాస్వామ్య సమాజంలో చట్టబద్ధమైన, శాంతియుతమైన పద్ధతుల్లో నిరసనలు తెలపడమే సరైన మార్గమని, ఇతర తీవ్రవాద ధోరణులతో పోల్చుకుంటూ హింసను ప్రేరేపించడం ప్రజాస్వామ్య విలువలను బలహీనపరుస్తుందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.  ఈ సున్నితమైన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే దీనిని మతపరమైన ఘర్షణగా మార్చడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సమస్యను మతాల మధ్య వైషమ్యాలుగా చిత్రీకరిస్తే అసలు అంశమైన కంటెంట్ నైతికత, మైనర్ల సంరక్షణ వంటి కీలకమైన సవాళ్లు పక్కదారి పడతాయి. కాబట్టి, అన్ని మతాల సాంస్కృతిక గౌరవాన్ని కాపాడేలా సమాన నైతిక ప్రమాణాలను తీసుకురావాలి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై వయస్సు పరిమితులు, కఠినమైన వర్గీకరణలు మరియు పారదర్శక నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు, సమాజంలో డిజిటల్ అక్షరాస్యతపై ఓపెన్ సంభాషణలు జరగడమే ఇందుకు సరైన మార్గం.  

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...