అఖిలేష్‌ యాదవ్‌కి సుప్రీం మొట్టికాయలు

posted on: Jan 28, 2016 10:39AM

ఉత్తర్‌ప్రదేశ్‌లో లోకాయుక్తిని నిర్ణయించే ప్రక్రియలో ఆ రాష్ట్రముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కి సుప్రీంకోర్టులో ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. అఖిలేష్‌ ఏరికోరి ఎన్నుకున్న ‘వీరేంద్ర సింగ్‌’ను సుప్రీం కోర్టు లోకాయుక్త పదవి నుంచి తొలగించింది. ‘ఆయన ఎన్నిక విషయంలో మాకు చాలా సందేహాలు కలుగుతున్నాయంటూ’ వ్యాఖ్యానించింది ధర్మాసనం. ములాయం తనయుడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన అఖిలేష్‌ ఇప్పటికే అనేక సందర్భాలలో తన అనుభవ రాహిత్యాన్ని ప్రదర్శించారు. ఆ అనుభవ రాహిత్యం కాస్తా ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా చేరుకున్నట్లుంది. ఒక రాష్ట్రంలో జరిగే అవినీతిని సమర్థంగా ఎదుర్కొనేందుకు, ఎండగట్టేందుకు అక్కడి లోకాయుక్త ప్రయత్నిస్తారు. లోకాయుక్తగా ఎవరు ఉండాలన్నది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, విపక్ష నేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి తీసుకునే నిర్ణయం. కానీ హైకోర్టు న్యాయమూర్తిని ఏ మాత్రం లెక్కచేయకుండా విపక్ష నేతతో కుమ్మక్కయి తనకు అనుకూలమైన వ్యక్తిని లోకాయుక్తగా ఎన్నకున్నారన్నది అఖిలేష్‌ మీద వచ్చిన ప్రధాన అభియోగం. వీరేంద్ర సింగ్‌, అఖిలేష్‌కి చాలా సన్నిహితుడు కావడం; వీరేంద్ర సింగ్‌ తమ్ముడు, ఇద్దరు పిల్లలు కూడా ప్రభుత్వ న్యాయవాదులుగా ఉండటం వల్లనే అఖిలేష్‌ ఆయనను లోకాయుక్తగా నియమించారన్నది ఆరోపణ. వీరేంద్రను లోకాయుక్తగా ఎన్నుకోవద్దంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంతగా మొత్తుకున్నా అఖిలేష్‌ ఎలాగొలా తన మాటనే నెగ్గించుకున్నారు. కానీ ఇప్పడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ ఈ మొత్తం వ్యవహారం మీద ఏకంగా సుప్రీం కోర్టుకే లేఖ రాయడంతో ఇప్పడు లోకాయుక్త నియామకం కాస్తా రద్దయింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...