భోగాపురం వద్ద ఎయిర్ పోర్ట్ సిటీ నిర్మాణానికి కసరత్తు మొదలు
posted on: Mar 14, 2015 9:57PM
.jpg)
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ చాలా ఆత్మవిశ్వాసం కనబరుస్తూ అనేక భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టులు మరియు రాజధాని నిర్మాణం అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును. ఇప్పుడు తాజాగా విజయనగరం-విశాఖ నగరాల మధ్య ఉన్న భోగాపురం వద్ద 15, 000 ఎకరాల స్థలంలో ఒక విమానాశ్రయం, విమాన శిక్షణ కేంద్రం, విమానాల రిపేరింగ్ మరియు సర్వీసింగ్ విభాగలతో కూడిన ఒక ‘ఎయిర్ పోర్ట్ సిటీ’ నిర్మాణం చేసేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసం సాంకేతిక మరియు సామాజిక సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఆర్.ఐ.టి.ఈ.యస్.(రైట్స్) అనే ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థకు పని అప్పగించింది. ఆ సంస్థ ఈ ఏడాది చివరిలోగా తన నివేదిక సమర్పిస్తుంది.
ఎయిర్ పోర్ట్ సిటీ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల నుండి మొత్తం 28 అనుమతులు పొందవలసి ఉంటుందని వాటిలో కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన 18 అనుమతులను వచ్చే ఏడాదిలోగా సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని రాష్ట్ర మౌలిక వసతుల కల్పనా శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టుని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపడతామని అందులో ప్రభుత్వం తన వాటాగా భూమిని ఇస్తుందని ఆయన తెలిపారు. దీని కోసం భోగాపురం వద్ద మొత్తం 15, 000 ఎకరాల స్థలం సేకరించి అందులో 5000 ఎకరాలు విమానాశ్రయానికి, 5000 ఎకరాలు విమాన శిక్షణ మరియు సర్వీసింగ్ విభాగాలకి, మిగిలిన 5000 ఎకరాలు అభివృద్ధి చేసి తిరిగి రైతులకే అప్పగిస్తామని ఆయన తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ (నోడల్ సంస్థ)ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.
భోగాపురం వెళ్ళేదారిలోనే ఉన్న మధురవాడ వద్ద ఐ.టి.హబ్, ఐ.టి.ఇంక్యూబేటర్ సెంటర్, గంభీరం గ్రామం వద్ద ఐ.ఐ.యం. మొదలయిన ఉన్నత విద్యా ఉపాధి సంస్థలు రాబోతున్నాయి. ఇంతకాలం అభివృద్ధికి నోచుకోని విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలకు ప్రత్యేక హోదా లేదా స్పెషల్ ప్యాకేజి వచ్చే అవకాశం ఉంది గనుక ఆ రెండు జిల్లాలలో మున్ముందు అనేక పారిశ్రామిక కారిడార్లు కూడా ఏర్పాటవ్వబోతున్నాయి. ఒకవేళ ఈ ఎయిర్ పోర్ట్ సిటీ కల కూడా సాకారం అయినట్లయితే ఇక విశాఖతో బాటు విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో కూడా అభివృద్ధి జోరందుకొంటుంది.



.jpg)
.jpg)


.webp)


