మీరు ప్రజాప్రతినిధులని గుర్తుంచుకోండి..?

posted on: Aug 1, 2016 4:00PM

ప్రజాస్వామ్యంలో చట్టసభలు పవిత్రమైనవని, అత్యున్నతమైనవని అంటారు. కొందరు చట్టసభలు దేవాలయాల వంటివని కూడా చెబుతారు. అలాంటి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీలు దేశ అత్యున్నత వ్యవస్థను అపహస్యం చేసేలా ప్రవర్తించారు. ఢిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయం..ప్రయాణికులు బోర్డింగ్ పాస్ తీసుకుని..సెక్యూరిటి చెక్‌కు వెళుతున్న వేళ ఒక నడివయసు మహిళ మరో నడి వయసు వ్యక్తి చెంప చెళ్లుమనిపించింది..పిడిగుద్దులు కురిపించింది, కాళ్లతో తన్నింది..అక్కడున్న వారికి అసలెం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటున్న వాళ్లు ఎవరా..? అని ఆరా తీస్తే వారిలో ఒకరు అన్నాడీఎంకే ఎంపీ శశికళపుష్ప, మరోకరు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, ఘనత వహించిన భారత పార్లమెంట్ సభ్యులు.

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను, అన్నాడీఎంకేను హేళన చేయడంతో తనలో సహనం నటించి శివను కొట్టినట్లు ఆవిడ చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రాల్లోని అసెంబ్లీలు, పార్లమెంటు ఎంత చక్కగా పనిచేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. పార్లమెంట్ ఏనాడైనా సజావుగా జరుగుతోందా..? ప్రజాసమస్యలు చర్చకు వస్తున్నాయా..? యూపీఏ హయంలో, ఇప్పుడు ఎన్‌డీఏ జమానాలో పార్లమెంటు రణరంగ వేదికగా మారిందే తప్ప ప్రజా సమస్యలను చర్చించే వేదికగా లేదు. రాజకీయ పార్టీలు పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి పార్లమెంటును ఉపయోగించుకుంటున్నాయి. ప్రతి రోజూ గొడవలు, అరుపులు, కేకలతో సభలు దద్దరిల్లుతున్నాయి. ప్రజా సమస్యలు చర్చించే అత్యున్నత వేదిక..బజారు రాజకీయాలతో కొట్టుకునే అడ్డాగా మారిపోయింది. సభ్యులు ఒకరినొకరు అసభ్యపదజాలంతో దూషించుకోవడం, మిగతా సభ్యులు వారికి వంత పడటం ఇదొక ప్రహసనంలా తయారైంది.

 

ఇక తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల రాజకీయ వైరం గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎన్నో సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగి చొక్కాలు చింపుకున్నారు. సొంత రాష్ట్రం..బయట తెలిసినా ఇలాంటివి అక్కడ మామూలే అనుకుంటారు. కాని సాక్షాత్తూ ఢిల్లీ నడివీధుల్లో ఇద్దరు తమిళ నేతలు ముష్టి యుద్ధానికి దిగి ఆ రాష్ట్రం పరువును యమునా నదిలో కలిపేశారు. ఇక్కడొక సంగతి గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు..ఎప్పుడైతే ఖద్దరు చొక్కా వేసుకున్నారో అప్పటి నుంచి రాగద్వేషాలకు, కోపతాపాలకు అతీతంగా మెలగాలి. వారు ఒక నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తే ఆ బాధ్యత మరింత పెరుగుతుంది. ఆ నియోజకవర్గంలోని ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా పరిగెత్తుకు వచ్చేది ఆ ప్రజాప్రతినిధి వద్దకే..అందువల్ల అతను అత్యున్నత గౌరవ మర్యాదలు పొందబడతాడు. అలాంటి వ్యక్తులు ఇలాంటి చిల్లర పనుల వల్ల ఆ గౌరవానికి చేటు తెచ్చుకోవడమే కాకుండా మొత్తం వ్యవస్థపైనే నమ్మకం పొగొడుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు తాము ఎవరమో..ఎలాంటి హోదాలో ఉన్నామో గుర్తేరిగి హుందాగా మెలిగితే మంచిది.

google-ad-img
    Related Sigment News
    • Loading...