Latest News
అమ్మబాబోయ్.. ఏఐని ఇలా కూడా వాడేస్తారా?
posted on: Mar 10, 2026 2:18PM

టెక్నాలజీ పెరుగుతోంది. సర్వులకూ అందుబాటులోకి వస్తున్నది. ఆధునిక సాంకేతికత అన్నది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. మంచికి ఎంతగాదోహదం చేస్తుందో.. చెడుకూ అంతగా ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో పెచ్చరిల్లిన సైబర్ క్రైమ్స్ ఇందుకు నిదర్శనం. ఇక ఈ టెక్నాలజీ విద్యాభివృద్ధికి ఎంతగా దోహదం చేస్తున్నదో.. అలాగే విద్యావ్యవస్థ పతనానికి కూడా దోహదపడుతోందని తాజాగా ఒక ఉదంతం తేటతెల్లం చేసింది. టెక్నాలజీని ఇలా కూడా వాడేస్తారా? వాడేయొచ్చా? అన్న విస్మయాన్ని కలిగించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. చాట్ జీపీటీని ఉపయోగించి హైటెక్ స్కాం జరిగింది. అలా ఇలా కాదు.. చాట్ జీపీటీని వినియోగించి విద్యార్థుల కాపీయింగ్ కు గురువులే తెగబడి విద్యావ్యవస్థకే మచ్చ తీసుకు వచ్చారు. విద్యార్థి ప్రతిభ, సామర్థ్యం గురించి తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తుంది విద్యాశాఖ. అయితే ఆధునిక సాంకేతికతో ఆ పరీక్షా విధానాన్నే అపహాస్యం చేసేందుకు కొందరు తెగబడటం సంచలనం రేపింది. ఇంతకీ ఏం జరిగిందంటూ మహారాష్ట్రలో ఇటీవల జరిగిన టెన్త్, ఇంటర్ పరీక్షలలో చాట్ పీజీని ఉపయోగించి కొందరు గురువులు విద్యార్థుల మాస్ కాపీయింగ్ కు తెరలేపారు. ఈ సంఘటన బీడ్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.. నిర్వహించిన దాడుల్లో పరీక్షా విధుల్లో ఉన్న టీచర్లు, ఇన్విజిలేటర్లు తమ మొబైల్ ఫోన్లను చేతిలో పట్టుకుని, ఏఐ బాట్ అయిన చాట్‌జీపీటీని వాడి సెకన్లలో వచ్చే సమాధానాలను రాబట్టి విద్యార్థులకు అందజేస్తూ అడ్డంగా దొరికిపోయారు. చాట్‌జీపీటీకి ప్రశ్న ఫీడ్ చేస్తే అది స్టెప్-బై-స్టెప్ ఇచ్చే సమాధానాన్ని పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందజేస్తూ కాపీయింగ్ ను ప్రోత్సహిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
దీంతో సీరియస్ అయిన మహా సర్కార్ ఇలా చాట్ జీపీటిని ఉపయోగించి విద్యార్థుల కాపీయింగ్ కు సహకారమందిస్తున్న దాదాపు 81 మంది ఎగ్జామినేషన్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి డిజిటల్ అక్రమాలు జరగకుండా ఉండటానికి పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. "టెక్నాలజీని విద్యాబుద్ధులు నేర్పడానికి వాడాల్సింది పోయి, ఇలా అక్రమాలకు వాడటం ఏంటంటూ విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉండగా, ఈ ఏఐ కాపీయింగ్ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు ఇలా అక్రమాలకు పాల్పడితే, వారి వద్ద జదువుకుంటున్న విద్యార్థుల భవిషత్ అంధకారబంధురమే అవుతుందన్న ఆందోళణ వ్యక్తం అవుతోంది.


.webp)



