Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్...మృత్యుంజయుడు ఆవేదన
posted on: Jun 12, 2026 7:20PM
.webp)
ప్రమాద దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది రామ్మోహన్ నాయుడు..
దేశాన్ని కుదిపేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ ఘోర దుర్ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా.. కేవలం ఒకే ఒక్కడు మృత్యువును జయించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఒంటరి సర్వైవర్ విశ్వాస్ కుమార్ రమేశ్ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తాజాగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తాను శారీరకంగా బతికి ఉన్నప్పటికీ, అంతర్గతంగా ప్రతిరోజూ నరకం చూస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిటన్‌లో స్థిరపడిన విశ్వాస్ కుమార్ గతేడాది గుజరాత్‌లోని తన కుటుంబ సభ్యులను కలిసి తిరిగి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ దురదృష్టకర రోజున ఆయన విమానంలో ‘11-A’ నంబర్ సీటులో కూర్చున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపుతప్పి కూలిపోవడంతో, విశ్వాస్ కూర్చున్న సీటు విరిగి కిందపడిపోయింది. దీనివల్ల ఆయనకు మంటలు అంటుకోకుండా ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ఆయన తన సొంత సోదరుడు అజయ్‌ను కోల్పోవడం గమనార్హం.
రక్తపు మరకలతోనే నడుచుకుంటూ వచ్చి విశ్వాస్ అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఏడాది గడిచినా ఆ భయానక రాత్రి తనను వెంటాడుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. తాను ఇప్పటికీ తీవ్ర నిద్రలేమి, ఆందోళనతో పోరాడుతున్నానని జాతీయ మీడియాతో చెప్పారు. కేవలం తాను ప్రాణాలతో బయటపడటమే అందరికీ కనిపిస్తోందని, కానీ నాలుగు గోడల మధ్య తన మనసు పడుతున్న క్షోభ ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
బాధిత కుటుంబాల తరఫున విశ్వాస్ కుమార్ అధికారులను ఒకే ప్రశ్న అడుగుతున్నారు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, కానీ ఈ ప్రమాదానికి అసలు కారణాలేంటో బాధితులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబాల మనసుల్లో ఉన్న ఎన్నో సందేహాలకు ప్రభుత్వం నుంచి నిజాయతీతో కూడిన సమాధానాలు రావాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన తుది దర్యాప్తు నివేదిక రావడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ప్రమాద తీవ్రతపై ఎయిరిండియా మాతృ సంస్థ టాటా గ్రూప్ కూడా కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు 96 శాతం బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున మధ్యంతర పరిహారం అందించామని పేర్కొంది. అలాగే 91 శాతం కుటుంబాలకు కోటి రూపాయల పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించినట్లు స్పష్టం చేసింది. అయితే తమ ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉన్న 15 కుటుంబాలు.. మృతుల వ్యక్తిగత వస్తువులను తిరిగి తీసుకోవడానికి నిరాకరించడం అందరినీ కలచివేస్తోంది.
మరోవైపు, విమానం హాస్టల్ భవనంపై కూలడంతో మరణాల సంఖ్య 260కి చేరిన సంగతి తెలిసిందే. ఆ ధ్వంసమైన హాస్టల్ ప్రాంగణాన్ని ఒక ఉపయోగకరమైన కేంద్రంగా మార్చాలని గుజరాత్ సర్కార్ నిర్ణయించింది. అక్కడ రూ.547 కోట్ల భారీ వ్యయంతో అత్యాధునిక మెడికల్ హబ్‌ను నిర్మించనున్నట్లు రాష్ట్ర మంత్రి ప్రఫుల్ పన్సేరియా వెల్లడించారు. వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు, అవకాశాలు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. బాధిత కుటుంబాలకు మరోసారి సానుభూతి ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా నైపుణ్యంతో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా మరియు నిష్పక్షపాతంగా నిర్ధారించడానికి, అలాగే విమానయాన భద్రతను మరింత మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.






