ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో తాహిర్ హుస్సేన్ దోషి.!

posted on: Jul 15, 2026 4:49PM

దేశ రాజధాని ఢిల్లీలో  కొన్నేళ్ల క్రితం చోటుచేసుకున్న అత్యంత దారుణమైన కమ్యూనల్ అల్లర్ల ఉదంతం..  ఇప్పుడు న్యాయపరంగా  నిర్ణయాత్మక దశకు చేరుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చుట్టూ ముదిరిన వివాదాలు, ఆందోళనల నేపథ్యంలో 2020లో ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండ తీవ్ర రక్తపాతానికి దారితీసిన సంగతి తెలిసిందే. దాదాపు 53 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ అల్లర్ల పర్వంలో, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) యువ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ   క్రూర  హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు  వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరికొందరిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. జూలై 23న వీరికి విధించే శిక్షల పరిమాణంపై కోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. అయితే, అదే సమయంలో ఈ తీర్పు చుట్టూ దేశ రాజకీయాల్లో ఒక కొత్త వివాదం ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ఈ న్యాయ ప్రక్రియకు మతపరమైన రంగును పులిమేలా ఉందనే విమర్శలకు దారితీశాయి.

ఈ మొత్తం వివాదానికి మూలాలు 2019 చివరి నాటి రాజకీయ పరిణామాలలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత, దేశవ్యాప్తంగా అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్రమైన చర్చోపచర్చలు జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వంటి ప్రాంతాలలో నెలల తరబడి సాగిన రహదారి దిగ్బంధనాలు, ధర్నాలు రాజధాని నగరంలో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణాన్ని రగిల్చాయి. ఇది చివరకు 2020 ఫిబ్రవరి 23 నుండి 26 మధ్య కాలంలో ఈశాన్య ఢిల్లీ పరిధిలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, చాంద్ బాగ్, ఖజూరి ఖాస్, ముస్తఫాబాద్ వంటి   సమస్యాత్మక ప్రాంతాలలో తీవ్రస్థాయి మత ఘర్షణలుగా రూపాంతరం చెందింది. పరస్పరం రాళ్ల దాడులు చేసుకోవడం, ఆస్తులను తగులబెట్టడం, పెట్రోల్ బాంబుల వినియోగం,  ప్రార్థనా మందిరాలపై దాడులతో ఆ ప్రాంతాలన్నీ రణరంగంగా మారాయి. ఈ ఘోర హింసలో వందలాది మంది తీవ్రంగా గాయపడగా, 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్ల వెనుక ఉన్న లోతైన కుట్రలను, నేరాలను ఛేదించడానికి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగాలు, క్రైమ్ బ్రాంచ్ సంస్థలతో పాటు జాతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే స్థానిక రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఉన్న తాహిర్ హుస్సేన్ పాత్ర ఈ అల్లర్లలోను, ఐబీ అధికారి హత్యలోనూ ప్రధానంగా తెరపైకి వచ్చింది.

కేసు వివరాల్లోకి వెళితే, 2020 ఫిబ్రవరి 25న కేవలం 26 ఏళ్ల వయసున్న ఐబీ అధికారి అంకిత్ శర్మ విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి తిరిగొచ్చారు. ఆ తర్వాత బయటకు వెళ్లిన ఆయన ఎంతకీ తిరిగి రాకపోవడంతో, ఆందోళన చెందిన ఆయన తండ్రి రవీందర్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా లభించిన సమాచారం ప్రకారం, చాంద్ బాగ్ వంతెన సమీపంలో ఉన్న ఒక భవనం వద్ద అంకిత్‌ను ఒక ఉన్మాద గుంపు అపహరించి, హతమార్చి, అనంతరం అక్కడే ఉన్న ఖజూరి ఖాస్ మురికి కాలువలో పడవేసినట్లు తెలిసింది. ఆ తర్వాత పోలీసులు కాలువ నుండి ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైన నిజాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అంకిత్ శర్మ శరీరంపై ఏకంగా 51 కి పైగా తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పదునైన ఆయుధాలతో, అత్యంత పాశవికంగా దాడి చేసి ఆయనను హత్య చేసినట్లు తేలింది. తాహిర్ హుస్సేన్‌కు చెందిన భవనం నుంచే ఈ నేరానికి పాల్పడిన గుంపు పనిచేసిందని, ఆ గుంపే తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని అంతమొందించిందని రవీందర్ కుమార్ తన ఫిర్యాదులో   ఆరోపించారు. దీని ఆధారంగా సుదీర్ఘంగా సాగిన న్యాయ విచారణ ప్రక్రియ ఇప్పుడు ఒక ముగింపునకు వచ్చింది.

కార్కర్డూమా కోర్టుకు చెందిన అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్ దాదాపు 320 పేజీలతో కూడిన సుదీర్ఘమైన, సమగ్రమైన తీర్పును వెలువరించారు. ఈ తీర్పులో న్యాయమూర్తి పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. నిందితుడు తాహిర్ హుస్సేన్ ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఏర్పడిన చట్టవ్యతిరేక జనసమూహంలో కీలక సభ్యుడని కోర్టు నిర్ధారించింది. అల్లర్లు జరిగిన రోజున చాంద్ బాగ్ ప్రాంతంలో సదరు గుంపు ఆయుధాలతో సిద్ధమై, ప్రాణ నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే వ్యవహరించిందని, ఆ గుంపులోని వ్యక్తులే అంకిత్ శర్మను బలవంతంగా లాక్కెళ్లి అత్యంత క్రూరంగా దాడి చేసి హతమార్చారని కోర్టు తన తీర్పులో పేర్కొంది.  ఒక చట్టవ్యతిరేక సమూహంలో భాగస్వామిగా ఉన్నందుకు, ఐపీసీ సెక్షన్ 149 ప్రకారం ఆ గుంపు చేసిన హత్యకు తాహిర్ హుస్సేన్ కూడా సమాన బాధ్యుడవుతాడని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 365 (అపహరణ), 153A (మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం) వంటి అ  సెక్షన్ల కింద నేరం రుజువైంది. అయితే, నేరపూరిత కుట్ర  వంటి కొన్ని సెక్షన్లలో ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలు చూపలేకపోవడంతో వాటి నుండి మినహాయింపు లభించింది. తాహిర్‌తో పాటు నజీమ్, కాసిమ్, జావేద్, అనస్ అనే నలుగురిని కూడా కోర్టు దోషులుగా ప్రకటించగా, తగిన ఆధారాలు లేని కారణంగా మరో ఆరుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది.

ఈ తీర్పు వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. తాహిర్ హుస్సేన్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచిన బలమైన స్థానిక నేత కావడంతో..  ఈ అంశంపై ఆప్ నాయకత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అల్లర్ల సమయంలో ఆయన నివాసం వేదికగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ సీసాలు సరఫరా అయ్యాయనే ఆరోపణలు రాగానే పార్టీ ఆయనను సస్పెండ్ చేసినప్పటికీ..  అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో సరైన రాజకీయ లేదా నైతిక వైఖరి తీసుకోకుండా మౌనం వహించారనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఏకంగా కేజ్రీవాల్ అండదండలతోనే ఇదంతా జరిగిందనీ, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక విచారణ సంస్థలు గానీ, న్యాయస్థానాలు గానీ కేజ్రీవాల్‌కు ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఎక్కడా నిర్ధారించలేదు.

మరోవైపు..  కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఈ తీర్పుపై స్పందిస్తూ, తాహిర్ హుస్సేన్ ముస్లిం కావడం వల్లే ఆయన్ను టార్గెట్ చేశారని, ఒకవేళ ఆయన పేరు 'తాహిర్' కాకుండా 'కపిల్' అని ఉండి ఉంటే ఈ పాటికి నిర్దోషిగా బయటకు వచ్చేవారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశంలో సరికొత్త చర్చకు దారితీశాయి. న్యాయస్థానం సాక్ష్యాధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తీర్పు ఇస్తే..  దానికి మతపరమైన రంగు పులిమి న్యాయవ్యవస్థపైనే పక్షపాత ముద్ర వేయడానికి ప్రయత్నించడం బాధ్యతారాహిత్యమైన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

2020 నాటి ఢిల్లీ ఘర్షణలు కేవలం ప్రాణ నష్టాన్ని మాత్రమే మిగల్చలేదు, దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్న రెండు  ర్గాల మధ్య ఉన్న నమ్మకాన్ని, సామాజిక సామరస్యాన్ని దారుణంగా దెబ్బతీశాయి. అంకిత్ శర్మ వంటి యువకులు అటు ప్రభుత్వ భద్రతా వ్యవస్థలో ఉంటూనే, ఇటు స్థానికంగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. అలాంటి వ్యక్తిని ఇంత ఘోరంగా పొట్టనబెట్టుకున్న కేసులో కోర్టు తీర్పు ఇవ్వడం బాధిత కుటుంబానికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లభించిన  న్యాయపరమైన ఉపశమనంగా భావించవచ్చు.

ఈ తీర్పును ప్రధాన స్రవంతి మీడియా ఢిల్లీ అల్లర్ల కేసుల్లో నమోదైన మొట్టమొదటి కీలక హత్య నిరూపణగా  పేర్కొంటూ విస్తృతంగా కవరేజ్ ఇచ్చింది. తాహిర్ హుస్సేన్  రాజకీయ నేపథ్యం, ఆయన ఆస్తులు, అల్లర్లలో ఆ భవనం పోషించిన పాత్ర వంటి అంశాలపై పెద్ద ఎత్తున విశ్లేషణలు వచ్చాయి. అయితే, మీడియా,  రాజకీయ వర్గాల మధ్య నడుస్తున్న ఈ నేరేటివ్ వార్ లో బాధితుల కుటుంబాల అసలు వేదన, భవిష్యత్తులో ఇలాంటి మతపరమైన అల్లర్లు జరగకుండా పోలీసు వ్యవస్థలో తీసుకురావాల్సిన పటిష్టమైన సంస్కరణల గురించిన లోతైన చర్చలు చాలా వరకు మరుగునపడిపోతున్నాయనే ఆవేదన కూడా వ్యక్తమవుతోంది.

ఈ చారిత్రాత్మక తీర్పు కేవలం ఒక కేసు ముగింపు మాత్రమే కాదు..  దేశంలోని మిగిలిన అల్లర్ల బాధితులకు కూడా న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందనే   నమ్మకాన్ని కలిగిస్తుంది. అయితే..  ఈ ఉదంతం మన ప్రజాస్వామ్య వ్యవస్థ ముందు కొన్ని కీలకమైన ప్రశ్నలను ఉంచుతోంది. స్థానిక ప్రజాప్రతినిధులు లేదా రాజకీయ నాయకులే స్వయంగా కమ్యూనల్ హింసకు కేంద్ర బిందువులుగా మారినప్పుడు, భద్రతా వ్యవస్థలు ఎంత వేగంగా స్పందించాలనే దానిపై స్పష్టత రావాలి.

 న్యాయస్థానాలు పూర్తి ఆధారాలతో తీర్పులు ఇచ్చినప్పుడు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థపైనే మతపరమైన పక్షపాతం ఉందంటూ ఇమ్రాన్ మసూద్ వంటి నేతలు చేసే వ్యాఖ్యలను పౌర సమాజం ఎంతవరకు అంగీకరించాలనేది పెద్ద ప్రశ్న. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో వ్యవస్థలపై ఉన్న గౌరవాన్ని దెబ్బతీస్తాయి. ఇకపోతే.. రాజకీయ పార్టీలు కేవలం నిందితులపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో మళ్లీ శాంతిభద్రతలు నెలకొనేలా, భిన్న వర్గాల మధ్య మైత్రీ బంధం బలపడేలా బాధ్యతాయుతమైన కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక చివరిగా..  2020 నాటి ఈశాన్య ఢిల్లీ అల్లర్లు దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అంకిత్ శర్మ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా దోషులకు శిక్ష పడటం అనేది చట్టం శక్తిని నిరూపిస్తుంది. రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లేదా నిర్దిష్ట వర్గాలలో బాధిత  భావనను నింపడం కోసం చట్టపరమైన తీర్పులను వక్రీకరించడం మానుకోవాలి.   ఘోరమైన గాయాలు, బలమైన ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్న ఈ కేసులో మతం కార్డ్ ఉపయోగించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 23న కోర్టు ప్రకటించబోయే శిక్షల పరిమాణంపైనే ఉంది. ఈ పరీక్షా సమయంలో న్యాయవ్యవస్థ, రాజకీయ పక్షాలు,  మీడియా సంస్థలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సమాజంలో నిజమైన న్యాయం, శాంతిని పెంపొందించే దిశగా బాధ్యతాయుతంగా అడుగులు వేయడమే దేశానికి అత్యంత శ్రేయస్కరం.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.

2020 Delhi riots, Ankit Sharma murder case, Tahir Hussain convicted, Imran Masood

google-ad-img
    Related Sigment News
    • Loading...