Latest News
అడోబ్ సీఈవో శంతను నారాయణ్ రాజీనామా...ఎందుకంటే?
posted on: Mar 14, 2026 4:39PM

టెక్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన సీఈఓలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న శంతను నారాయణ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అడోబ్ సంస్థను దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయవంతంగా నడిపించిన ఆయన నిష్క్రమణ టెక్ పరిశ్రమలో ఒక శకం ముగింపుగా విశ్లేషకులు భావిస్తున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, సబ్‌స్క్రిప్షన్ మోడల్ వైపు అడోబ్‌ను మలిచిన కీలక నాయకుడిగా శంతను నారాయణ్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పోటీ కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపిందన్న చర్చలు వినిపిస్తున్నాయి.
అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ అడోబ్‌లో దాదాపు రెండు దశాబ్దాలుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కొనసాగుతున్న శంతను నారాయణ్ పదవి నుంచి తప్పుకోనున్నారనే వార్తలపై కంపెనీ స్పందించింది. కొత్త సీఈఓ నియామకం పూర్తయ్యే వరకు ఆయన సీఈఓగానే కొనసాగుతారని స్పష్టం చేసింది. అయితే సీఈఓ మార్పు వెనుక ఖచ్చితమైన కారణాలు ఏమిటనేది కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. శంతను నారాయణ్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ సంస్థ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతారని కంపెనీ తెలిపింది.
కొత్త సీఈఓ ఎంపిక కోసం అడోబ్ బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సంస్థలోని అభ్యర్థులతో పాటు బయటి అభ్యర్థులను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ సందర్భంగా సంస్థ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోని మాట్లాడుతూ… గత 18 సంవత్సరాలుగా శంతను నారాయణ్ సంస్థ అభివృద్ధికి చేసిన సేవలు విశేషమని ప్రశంసించారు. ముఖ్యంగా ఏఐ యుగంలో అడోబ్ విజయానికి ఆయన వేసిన పునాది ఎంతో కీలకమని అన్నారు.ఇక శంతను నారాయణ్ మాట్లాడుతూ… సీఈఓగా దాదాపు 18 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించానని తెలిపారు.
కొత్త సీఈఓ ఎంపిక పూర్తయ్యే వరకు బోర్డుతో కలిసి పనిచేస్తూ బాధ్యతల మార్పు సజావుగా జరిగేలా చూస్తానన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో కంపెనీలో సుమారు 3,000 మంది ఉద్యోగులు ఉండగా… ఇప్పుడు ఆ సంఖ్య 30,000 మందికి పైగా పెరిగిందని తెలిపారు. అదే విధంగా కంపెనీ ఆదాయం ఒక బిలియన్ డాలర్లకు కూడా తక్కువ స్థాయి నుంచి 25 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని చెప్పారు. అడోబ్ రూపొందించిన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను చేరుకుందని గర్వంగా వెల్లడించారు.



.webp)


