ఆదిమూలం కేసులో ఊహించని ట్విస్ట్!
posted on Sep 9, 2024 12:55PM
సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం అత్యాచారం కేసులో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. ఆదిమూలం ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో బయటపడిన నేపథ్యంలో ఆదిమూలం తనను లైంగికంగా వేధించారు, అత్యాచారం చేశారని ఆరోపించి, ఆయన మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ ఇప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరిస్తున్నారు. తన స్వగ్రామంలో తన ఇంటిలోనే వుంటున్న ఆమె పోలీసులు సూచిస్తున్నప్పటికీ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు రాజకీయంగా ఎలాంటి సపోర్టు లేదని, తనకు భయమేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె వైద్య పరీక్షలకు నిరాకరించడం కూడా ఆమెను ఎవరైనా బెదిరించారా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇదిలా వుంటే, ఆదిమూలం మీద అత్యాచారం కేసు పెట్టిన మహిళ మీద సత్యవేడు ప్రాంతంలోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న ఆదిమూలం లాంటి దళిత నాయకుడిని తొక్కేయడానికే ఆ మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తూ, కేసు పెట్టిందని వారు అంటున్నారు. సదరు మహిళ మీద తిరుపతి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వారు కేసులు నమోదు చేస్తున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్న ఈ వ్యవహారం ముందు ముందు ఇంకెన్ని టిస్టులు తిరుగుతుందో చూడాలి.