గొర్రెల్ని తినటానికి భూమ్మీదకొచ్చిన గ్రహాంతరవాసులు!
posted on: Jul 4, 2017 12:35PM

ఒకవైపు సోషల్ మీడియా, మరోవైపు యూ ట్యూబ్ వ్యూస్ కోసం తహతహ… ఈ రెండిటితో ఏ క్షణాన ఏ అబద్ధం నిజంలాగా మేకప్ చేసుకుని మనల్ని మోసం చేస్తుందో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది! ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లు వచ్చాక జనం సమాచారం ఇష్టం వచ్చినట్లు పంచుకుంటున్నారు. ఇందులో నిజం కంటే అబద్ధాలే ఎక్కువని అందరికీ తెలుసు. అయినా కూడా ఎప్పటికప్పుడు కలకలం రేపే పోస్టులు పోటెత్తుతుంటూనే వుంటాయి! ఇక సోషల్ మీడియాకి జోడుగా ఇప్పుడు యూ ట్యూబ్ వీడియోల దుమారం మొదలైంది. ఎవరు నాలుగు వ్యూస్ కోసం ఓ వీడియో చేసి పెట్టినా… అది వైరల్ అవుతోంది. నెటిజన్స్ తెలిసో, తెలియకో షేర్ లు చేసేసి గందరగోళానికి తెర తీస్తున్నారు! ఇప్పుడు అలాంటిదే… ఆదిలాబాద్ లో గ్రహాంతరవాసుల హంగామా!
ఏంటి ఆదిలాబాదులో గ్రహాంతర వాసులా అంటూ ఆశ్చర్యపోతున్నారా? ఇదే కావాలి… సదరు యూ ట్యూబ్ వీడియో పోస్ట్ చేసిన వారికి! ఇంతకాలం ఎక్కడో అమెరికాలో ఏలియన్స్ కనిపించారు, డ్యాన్స్ చేశారు, పాటలు పాడారు అంటూ కథలు చెప్పేవారు. ఇప్పుడు క్రియేటివిటికి, నేటివిటి జోడించి గ్రహాంతరవాసుల్ని ఆదిలాబాద్ అడవులకి తీసుకొచ్చారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఏలియన్స్ ఫోటోలు చిక్కాయంటూ మాంచి ఫోటో షాప్ పనితనం చూపించారు! పెద్ద పెద్ద గోర్లు, నెత్తిన రెండు కొమ్ములు వున్న వింత జంతువుల్లాంటి జీవుల్ని చూపించి … అవే గ్రహాంతరవాసులంటూ కహానీలు చెప్పేస్తున్నారు!
ఆసక్తికరమైన అబద్ధాల సమాహారంలా వున్న యూ ట్యూబ్ వీడియోలో మరో విడ్డూరం కూడా చెప్పారు! ఎక్కడో సుదూర గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతరవాసులు ఇక్కడ మన గొర్రెల్ని చంపి తింటున్నారట! ఈ మాత్రం దానికి అంత దూరం నుంచి భూమ్మీదకి రావాలా? వాళ్ల గ్రహంలో గొర్రెలు లేవంటారా? కరెక్టే… ఇక్కడ మనుషులు కూడా గొర్రెల్లా ఒకర్నొకరు ఫాలో అయిపోతుంటారని భావం కావచ్చు!
ఏది ఏమైనా, ఇప్పటి దాకా ఏ ఒక్కసారీ పక్కాగా నిరూపితం కాని గ్రహాంతర వాసుల కథనాల్ని నమ్మటం అంటే… ఆధునిక మూఢనమ్మకాల్ని ఆనందంగా అంగీకరించటమే! టైం వేస్ట్ తప్ప మరేం వుండదు!







.webp)


