మిల్బస్ వెనుక అసలు నిజాలు

posted on: May 7, 2026 2:18PM

పాకిస్తాన్ అనగానే ఎవరికైనా సరే  వెంటనే గుర్తుకు వచ్చేది అక్కడి రాజకీయాల్లో సైన్యం పోషించే కీలక పాత్ర.  తరచుగా జరిగే సైనిక తిరుగుబాట్లు.  పౌర ప్రభుత్వాల పతనం. అయితే, పాక్ ఆర్మీ కేవలం దేశ సరిహద్దులను కాపాడే రక్షణ దళం మాత్రమే కాదు. అది ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా కూడా  అవతరించింది. ప్రముఖ రచయిత్రి  డాక్టర్ ఆయిషా సిద్దీకా తన 'మిలిటరీ ఇన్-క్: ఇన్-సైడ్ పాకిస్తాన్స్ మిలిటరీ ఎకానమీ (Military Inc.: Inside Pakistan’s Military Economy) అనే గ్రంథంలో ఇందుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు.  సైన్యం ఒక ఆర్థిక వర్గంగా  ఎలా రూపాంతరం చెందిందో..  ఈ ధన బలం రాజకీయ అధికారాన్ని ఎలా శాసిస్తుందో ఆమె ఈ పుస్తకంలో లోతుగా విశ్లేషించారు.  ఈ విశ్లేషణలో ప్రధానంగా వినిపించే పదం  మిల్బస్  (Milbus). మిల్బస్ అంటే సైనిక వర్గం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించే  సైనిక మూలధనం.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ భారీ మూలధనం దేశ అధికారిక రక్షణ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించదు. ప్రభుత్వ ఆస్తులపై ప్రత్యేక హక్కులు పొందడం.  సైనిక ఫౌండేషన్ల ద్వారా లాభాలను ఆర్జించడం,

రిటైర్డ్ అధికారులకు భూములను, వ్యాపార అవకాశాలను కట్టబెట్టడం వంటి మార్గాల ద్వారా ఈ సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. ఇది కేవలం పాకిస్తాన్‌కే పరిమితం కాకపోయినప్పటికీ..  అక్కడ ఉన్న రాజకీయ అస్థిరత కారణంగా ఇది అత్యంత ప్రమాదకరంగా మారిందని సిద్దీకా తన పుస్తకంలో పేర్కొన్నారు.  పాకిస్తాన్ సైన్యం నిర్వహిస్తున్న వ్యాపార సామ్రాజ్యం సామాన్యమైనది కాదు. ఫౌజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్, బహ్రియా ఫౌండేషన్ వంటి పేర్లతో ఇవి సేవా సంస్థలుగా చలామణి అవుతున్నప్పటికీ..  వీటి కింద భారీ కార్పొరేట్ కంపెనీలు నడుస్తున్నాయి. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సిమెంట్, ఎరువులు, ఫుడ్ ప్రాసెసింగ్ నుండి మీడియా రంగం వరకు ప్రతిచోటా సైన్యం పాగా వేసింది.

చివరకు పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, డెయిరీ ఫామ్స్ వంటి చిన్న తరహా వ్యాపారాలను కూడా వదలకపోవడం గమనార్హం.  సిద్దీకా అంచనా ప్రకారం..  ఈ సైనిక ఆర్థిక సామ్రాజ్యం విలువ   20 బిలియన్ డాలర్ల పైమాటే.  ఈ వ్యవస్థలో రిటైర్డ్ సైనిక అధికారులకు లభించే ప్రోత్సాహకాలు సైన్యాన్ని ఒక ప్రత్యేక సామాజిక వర్గంగా నిలబెడుతున్నాయి. సైన్యంలో ఉన్నత పదవిని అధిరోహించడం అంటే కేవలం హోదా మాత్రమే కాదు, ఒక సంపన్న ఆర్థిక వర్గంలోకి ప్రవేశించడం అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ ఆర్థిక ప్రయోజనాల వల్లే..  సైనిక వర్గం ఎల్లప్పుడూ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటుంది. పౌర ప్రభుత్వాలు సైన్యాన్ని ప్రశ్నిస్తే తమ వ్యాపార ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనే భయంతో  సైన్యం తన అనుకూల విధానాలను రూపొందించుకునేలా ఒత్తిడి తెస్తుంది.  

పౌర ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం అత్యంత విధ్వంసకరంగా ఉంది. దేశంలోని భూములు, లైసెన్సులు, కాంట్రాక్టులు వంటి ప్రభుత్వ వనరులు క్రమంగా సైనిక సంస్థల పరమవుతున్నాయి. దీనివల్ల సామాన్య వ్యాపారవేత్తలకు మార్కెట్‌లో సమాన అవకాశాలు లభించకుండా పోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా..  ఈ వ్యాపార కార్యకలాపాలకు పారదర్శకత అనేది ఉండదు. పార్లమెంటరీ పర్యవేక్షణకు కానీ, పబ్లిక్ ఆడిటింగ్‌కు కానీ ఈ సంస్థలు తలొగ్గవు. ఫలితంగా ప్రజాస్వామ్యంలోని బాధ్యతాయుతమైన పాలన అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.  రాజకీయంగా చూస్తే..  పాకిస్తాన్ సైన్యం దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోంది. విదేశాంగ విధానం, భద్రత తదితర కీలక ఆర్థిక నిర్ణయాల్లో సైన్యానిదే తుది నిర్ణయం. హైబ్రిడ్ ప్రభుత్వాలను నడపడం ద్వారా పౌర పాలనను నామమాత్రం చేస్తూ..  తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇటువంటి ధోరణి వల్ల మీడియా, న్యాయవ్యవస్థ, రాజకీయ పార్టీలు బలహీనపడిపోతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆయిషా సిద్దీకా ఈ పుస్తకాన్ని వెలువరించినప్పుడు పాక్ సైన్యం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మీడియా విభాగం (ఐఎస్పీఆర్) ఈ గణాంకాలను తప్పుపడుతూ వివరణలు ఇచ్చింది. చివరకు ఆమె ప్రాణాలకు ముప్పు ఉందనే హెచ్చరికల నడుమ ఈ పరిశోధన బయటకు వచ్చింది. అయినప్పటికీ, పాకిస్తాన్ సివిల్, మిలిటరీ సంబంధాలపై వచ్చిన అత్యంత విశ్వసనీయమైన రచనగా ఇది ఇప్పటికీ నిలుస్తోంది.  

చెప్పాలంటే, ఒక దేశ సైన్యం కేవలం తుపాకులను మాత్రమే కాకుండా కంపెనీలను, బోర్డు రూమ్ లను కూడా నియంత్రించినప్పుడు ఆ దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. సైనిక ఆధిపత్యం నుంచి దేశాన్ని విముక్తం చేయాలంటే ఆర్థిక పారదర్శకత, బలమైన ప్రజా ఉద్యమం,  అంతర్జాతీయ మద్దతు అవసరమని సిద్దీకా అభిప్రాయపడ్డారు. సైన్యం ఒక స్వతంత్ర ఆర్థిక వర్గంగా మారిన దేశంలో ప్రజాస్వామ్యానికి చోటు ఎక్కడుంటుందనే ప్రశ్న ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది.  

- సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లైతే  https://www.teluguone.comను లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి

google-ad-img
    Related Sigment News
    • Loading...