వైఎస్సార్ కాంగ్రెస్ : సినిమావాళ్ళతో డ్రామా!
posted on Apr 10, 2014 12:32PM

ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో పాతాళంలో కూరుకుపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికి ఇంకా వుందని చాటుకోవడానికి చేతనైన డ్రామాలన్నీ ఆడుతున్నట్టు కనిపిస్తోంది. బుధవారం తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా నియోజకవర్గాలలో నామినేషన్లే పడలేదు. మిగతా స్థానాల్లో నామినేషన్లు వేసిన వాళ్లు కూడా ఆరు నూరైనా, భూమి తలకిందులైనా గెలవని వాళ్లే. దీన్ని చూసి తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ సమాధైపోయినట్టేనని జనంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డిసైడైపోయారు. కనీసం సీమాంధ్రలో అయినా ఉనికి చాటుకుందామనే ప్రయత్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న పనులు చిత్రంగా వున్నాయి. తన చిత్రమైన పనుల్లో భాగంగా సినిమా ఇండస్ట్రీలో పనిలేకుండా వున్నవాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ మా పార్టీకి ఎంత క్రేజుందో చూశారా అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. వంద సినిమాలు చేసేసి ప్రస్తుతం చేసే పనేమీ లేక విశ్రాంతి తీసుకుంటున్న దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని పార్టీలో చేర్చుకుంది. తెలుగు సినిమా రంగం, ప్రేక్షకులు ఏనాడో మర్చిపోయిన పూర్ణిమని గురువారం పార్టీలో చేర్చుకుని వైసీపీ నాయకులు మురిసిపోతున్నారు. ఈ ఎన్నికలలో దుంపనాశనం కాబోతున్న ఈ పార్టీకి చివరికి మిగిలేది ఈ ఆనందమేనేమో!