శివాజీకి రాజకీయ పాఠాలు
posted on May 4, 2015 6:35PM

సినీ నటుడు, బీజేపీ నాయకుడు (ఆయన బీజేపీ నాయకుడు కాదని బీజేపీ వాళ్ళు అంటున్నారు అది వేరే సంగతి) శివాజీ ఇప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చినవాళ్ళు కొంతకాలం ఏ పార్టీలో అయినా చేరి కార్యకర్తగా పనిచేస్తారు. దాదాపు అన్ని పార్టీలూ తమ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ ఇస్తూ వుంటాయి. ఇలా సొంత అనుభవాలు, పొందిన శిక్షణ, నేర్చుకున్న గుణపాఠాలతో ఎవరైనా రాజకీయ నాయకుడిగా రాటుతేలుతూ వుంటారు. అయితే నటుడు శివాజీకి రాజకీయాల్లో అనుభవం తక్కువ. నరసరావుపేట నుంచి టీవీ రంగానికి, టీవీ రంగం నుంచి సినిమా రంగానికి, ఆ తర్వాత సినిమాల నుంచి డైరెక్టుగా రాజకీయ రంగానికి వచ్చారాయన. దాంతో ఆయనకు రాజకీయాలంటే ఏమిటి, రాజకీయ నాయకులంటే ఎలా వుంటారు... ఎలా వుండాలి అనే అవగాహన సహజంగానే తక్కువ. అయితే ఆయన విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ‘రాజకీయాలు’ ఆయనకు రాజకీయ పాఠాల్లా ఉపయోగపడుతున్నాయి. రాటు తేలేలా చేస్తున్నాయి.
మొన్నటి ఎన్నికలలో శివాజీ బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు మంత్రిగా వున్న బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న రోజునే శివాజీ కూడా ఆయనతోపాటుగా బీజేపీలో చేరారట. ఆ విషయం శివాజీనే చెప్పారు. వీర్రాజు అనే బీజేపీ నాయకుడు అసలు శివాజీ బీజేపీకి చెందిన నాయకుడే కాదని అన్నప్పుడు శివాజీ ఈ వివరణ ఇచ్చారు. తాను బీజేపీ నాయకుడిని కాకపోతే, మంత్రిగా వున్న కామినేని శ్రీనివాస్ కూడా బీజేపీ నాయకుడు కాదని శివాజీ చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే, మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా శివాజీ ఏ పార్టీలో వున్నాడో తనకు తెలియదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రిణి పురందేశ్వరి కూడా శివాజీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. ఇలా బీజేపీలోని నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీలో శివాజీకి అస్తిత్వమే లేదని ప్రకటిస్తూ వుండటం శివాజీకి అసలు ‘రాజకీయాలు’ అంటే ఏమిటో అర్థమయ్యేలా చేస్తున్నాయి.
శివాజీ బీజేపీ నాయకుడు అవునా, కాదా అనే సందేహం మొన్నటి వరకూ బీజేపీ నాయకులు ఎవరికీ కలగలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని జలదీక్ష, నిరసన దీక్షలు చేస్తూ వుండే సరికి ఆయన బీజేపీ నాయకుడు కానేకాదని చెబుతున్నారు. శివాజీ గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేస్తే చిన్నా చితకా సంఘాల నాయకులే తప్ప ప్రధాన పార్టీల నాయకులెవరూ పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అందరూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అంటారు. అదే డిమాండ్‌తో శివాజీ దీక్ష చేస్తే మాత్రం ఎంతమాత్రం పట్టించుకోరు. దీన్నే రాజకీయం అంటారు. జరుగుతున్న పరిణామాలన్నీ శివాజీకి రాజకీయ పాఠాలుగా ఉపయోగపడుతూ వుండవచ్చు.