ప్రొఫెసర్‌ జయశంకర్‌ను కేసీఆర్‌ అవమానించారు : వీహెచ్

posted on: Aug 6, 2026 8:15PM

 

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆరోపించారు. ప్రస్తుతం ఆయన జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రొఫెసర్‌ జయశంకర్‌ను ఎంతో గొప్పగా కీర్తిస్తుండటం తనకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

ఒక సందర్భంలో తాను, అప్పటి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ ముగ్గురమే కలిసి ఉన్నామని హనుమంతరావు గుర్తుచేశారు. ఆ సమయంలో కేసీఆర్‌ జయశంకర్‌ను అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు. ఆ మాటలు విని తాను తీవ్రంగా బాధపడ్డానని చెప్పారు.

ఆ తర్వాత జయశంకర్‌ను తాను ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. "ఈ రోజు మాట్లాడిన మాటలు చాలా తక్కువ. ఇలాంటి మాటలు ఆయన తరచూ అంటుంటారు. కానీ నేను ఏమీ చేయలేను హనుమంతన్నా. నాకు ఆలోచన ఉంది.. దాన్ని అమలు చేసే శక్తి నాకు లేదు" అని చెప్పారని హనుమంతరావు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఎలాంటి మాటలు మాట్లాడినా భరిస్తున్నానని ఆ సమయంలో జయశంకర్‌ తనతో చెప్పారని ఆయన తెలిపారు. మంచి అయినా, చెడు అయినా తెలంగాణ కోసం భరిస్తున్నాననే భావనతో జయశంకర్‌ వ్యవహరించారని పేర్కొన్నారు.

జయశంకర్‌ బతికున్న సమయంలో ఆయనను అవమానించిన నాయకులే ఇప్పుడు ఆయన జయంతి సందర్భంగా ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారని హనుమంతరావు విమర్శించారు. బతికున్నప్పుడు గౌరవం ఇవ్వకుండా, మరణించిన తర్వాత దేవుడిలా కొలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకాలం తాను ఈ విషయాలపై మాట్లాడలేదని, అయితే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నాయకులు జయశంకర్‌ గురించి మాట్లాడుతున్న తీరును చూసి ఈ వీడియో చేయాల్సి వచ్చిందని వి. హనుమంతరావు తెలిపారు.

Acharya Jayashankars birth anniversary, Telangana ideologue, CM Revanth Reddys tribute, KTRs memorial, Telangana movement, KTR BRS, Bandi Sanjay

google-ad-img
    Related Sigment News
    • Loading...