Latest News
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. పెరిగిన నిందితుల సంఖ్య
posted on: Mar 27, 2026 7:08AM
.webp)
తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో సిట్ కీలక పురోగతి సాధించింది. తొలుత కొద్దిమందికే పరిమితమైన నిందితుల జాబితా, విచారణ సాగుతున్న కొద్దీ భారీగా పెరుగుతూ వస్తున్నది. తాజాగా ఈ కేసులో నిందితుల సంఖ్య 15కు పెరి గింది.మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్‌పై జరిగిన దాడిలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో కొందరికి మాదకద్రవ్యాల సరఫరాలో కూడా పాత్ర ఉందని దర్యాప్తులో బయటపడింది. అలాగే విచారణలో మరికొంత మంది ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో కేసు తీవ్రత పెరిగింది. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ ఇతర రాష్ట్రాలలో కూడా సాగిందని సిట్ దర్యాప్తు తేల్చింది.
ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్ వారి నుంచి కీలకమైన వివరాలు రాబట్టారు. అలాగే నిందితుల నుంచి డిజిటల్. ఫోన్ కాల్ డేటాను సేకరించారు. ఈ క్రమంలోనే కొత్తగా మరికొంత మంది పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతొ ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కొత్తగా నిందితులుగా గుర్తించిన వారి కోసం గాలింపు చర్చలు చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారు జైలులో ఉండగా, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
రానున్న రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఫాంహౌస్‌ను సీజ్ చేసే దిశగా సిట్ ముందుకు సాగుతున్నది. ఇక పైలట్ రోహిత్ రెడ్డి గత నాలుగేళ్లుగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అలాగే అరెస్ట్ అయిన ప్రముఖ వైద్యుడు బాలాజీ, బాబీలోన్ పబ్ నిర్వాహకుడు అర్జున్‌రెడ్డి, ప్రియాంకరెడ్డి కలిసి వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు జూబ్లీహిల్స్‌లో కూడా ఈ పార్టీలు నిర్వహించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అలాగే, డాక్టర్ బాలాజీకి గోవాలోని డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తేలింది. కొన్నిసార్లు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కూడా ఈ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది.


.webp)
.webp)


