కత్తులతో తిరగబడ్డారు.. పోలీసుల కాల్పులు జరిపారు
posted on: Nov 29, 2025 9:24AM

పెంచలయ్య హత్య కేసు నిందితుల బరితెగింపు
గంజాయి మానండంటూ ప్రజలలో చైతన్యం తీసుకురావడం, గంజాయి బ్యాచ్ పై ఫిర్యాదు చేయడం అతడికి శాపంగా మారింది. విచ్చల విడిగా జరుగుతున్న గంజాయి విక్రయాలను అడ్డుకోవడానికి ప్రయత్నించడమే అతని ఉసురు తీసింది. నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం (నవంబర్ 28) సాయంత్రం దారుణ హత్యకు గురైన పెంచలయ్య నెల్లూరులో గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా గళమెత్తారు. అదే గంజాయి బ్యాచ్ ఆగ్రహానికి కారణమైంది.
9 మంది సభ్యుల గంజాయి బ్యాచ్ అతడిని కిరాతకంగా హత్య చేసింది. అయితే గంజాయి బ్యాచ్ బరితెగింపు అక్కడితో ఆగలేదు. హత్య కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తొమ్మది మంది సభ్యుల గంజాయి బ్యాచ్ ను గుర్తించి వారిని పట్టుకోవడానికి శుక్రవారం రాత్రి వారు దాక్కుని ఉన్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీకి వెళ్లారు. దీంతో గంజాయి బ్యాచ్ నిందితులు పోలీసులపై తిరగబడ్డారు. కత్తులతో దాడి చేసి ఒక కానిస్టేబుల్ ను గాయపరిచారు.
దీంతో పోలీసులు నిందితులపై జరిపిన కాల్పుల్లో ఒక నిందితుడు గాయపడ్డాడు. మిగిలిన నిందితులు పారిపోయారు. పారిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా నిందితుల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ను, పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.



.webp)


