పాక్‌పై భారత్ యువతుల ఘన విజయం

posted on: Feb 15, 2026 3:59PM

 

ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్‌ 2026 టోర్నీలో భారత్‌-ఏ జట్టు పాకిస్థాన్‌-ఏపై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్‌లో ఆదివారం (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది.టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టును భారత బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. క్రమంగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులకే ఆలౌట్ చేశారు. 

సెమీస్ ఆశలను నిలబెట్టుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. భారత బౌలర్లలో సైమా ఠాకోర్ (4-0-14-2), కెప్టెన్ రాధా యాదవ్ (3-0-11-2), ప్రేమా రావత్ (3-0-16-2) కీలక పాత్ర పోషించారు. జింటిమణి కలిట (1 వికెట్), మిన్నూ మణి (1 వికెట్) కూడా మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో షావల్ జుల్ఫికర్ (23), గుల్ రుఖ్ (21), అనోశా నాసిర్ (17) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.

అనంతరం 94 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే షాక్‌ తగిలింది. ఓపెనర్ హుమైరా ఖాజీ డకౌట్‌గా వెనుదిరిగినా, మరో ఓపెనర్ వ్రింద దినేశ్ అద్భుతంగా ఆడింది. 55 పరుగులతో అజేయ అర్ధ సెంచరీ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది. అనుష్క శర్మ (24), తేజల్ హసబ్నిస్ (12 నాటౌట్) మంచి సహకారం అందించారు. భారత్‌ కేవలం 10.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ బౌలర్లలో వహీదా అక్తర్, మొమినా రియాసత్‌కు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరుకుంది. భారత్‌ తన తదుపరి గ్రూప్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 17న నేపాల్‌తో తలపడనుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...