ఫోరెన్సిక్ నివేదిక కాపీ ఎసిబికి ఇవ్వలేము: కోర్టు

 

రేవంత్ రెడ్డిపై ఎసిబి అధికారులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో రికార్డు చేసిన ఆడియో, వీడియోలపై సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబ్స్ తయారుచేసిన నివేదికను రెండు రోజుల క్రితం ఎసిబి కోర్టుకి అందజేయబడింది. దాని కాపీ ఒకటి తమకు ఇమ్మని కోరుతూ ఎసిబి అధికారులు కోర్టులో ఒక మేమో దాఖలు చేసారు. సీల్డ్ కవరులో అందజేసిన ఆ నివేదికను ఈరోజు తెరిచిచూసిన ఎసిబి కోర్టు, దాని కాపీని ఎసిబి అధికారులు ఇచ్చేందుకు నిరాకరించింది.

 

అది అత్యంత రహస్యమయిన, కీలకమయిన ఆ ప్రాధమిక నివేదిక అని, కనుక దానిపై తమ తుది నివేదిక సమర్పించేవరకు ఎవరికీ దాని కాపీలు ఈయవద్దని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు తమ నివేదికలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ కారణంగానే ఎసిబి కోర్టు ఆ నివేదిక కాపీని ఎసిబి అధికారులకు ఇచ్చేందుకు నిరాకరించిందని సమాచారం. కానీ ఎసిబి అధికారులు ఆ నివేదికను కోర్టులో జడ్జి సమక్షంలో చూసేందుకు మాత్రం అనుమతించింది. దాని కోసం మళ్ళీ మరొక మెమో దాఖలు చేయమని కోర్టు ఆదేశించడంతో మధ్యాహ్నం భోజన విరామ సమయం తరువాత ఎసిబి అధికారులు కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు.

 

అయితే రెండు రోజుల క్రితం హైకోర్టు రేవంత్ రెడ్డి బెయిలు పిటిషన్ని విచారణకు స్వీకరించినప్పుడు, ఎసిబి తరపున వాదించిన న్యాయవాదులు ఈ కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తమకు కొన్ని బలమయిన ఆధారాలు లభ్యమయ్యాయని కనుక తమకు సోమవారం వరకు గడువు ఇస్తే ఆ ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని అంతవరకు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని కోరడంతో హైకోర్టు వారికి శుక్రవారం వరకు సమయం ఇచ్చింది. కానీ వారు ఊహించని విధంగా ఎసిబి కోర్టు ఫోరెన్సిక్ నివేదిక కాపీని ఇచ్చేందుకు నిరాకరించడంతో హైకోర్టుకి ఆధారాలు సమర్పించే అవకాశం కనబడటం లేదు. కనుక హైకోర్టు ఒకవేళ రేవంత్ రెడ్డి తరపున వాదిస్తున్న న్యాయవాదుల వాదనలతో ఏకీభవించినట్లయితే ఆయనకు ఆయనతో బాటుఅరెస్ట్ అయిన సెబాస్టియన్, ఉదయ సింహాలకు ఈరోజు బెయిలు మంజూరు చేసే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu