నిత్య విద్యార్ధి...గురువు అబ్దుల్ కలాం

 

ఒక సామాన్యమయిన మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ తన ప్రతిభాపాటవాలతో, అపూర్వమయిన మేధస్సుతో యావత్ ప్రపంచం చేత జేజేలు పలికించుకొన్న వ్యక్తి అబ్దుల్ కలాం. ఒక సైంటిస్ట్ రాష్ట్రపతి వంటి అత్యున్నతమయిన పదవిని చేప్పట్టడం, దానికీ తన అపూర్వమయిన వ్యక్తిత్వంతో కొత్త వన్నెలు అద్దడం బహుశః ఎక్కడా కనీవినీ ఉండము. భారతదేశాన్ని ఎందరో మహానుభావులు, హేమాహేమీలు పరిపాలించారు. ప్రజలకు మార్గదర్శనం చేసారు. వర్తమాన రాజకీయ పరిస్థితులలో మాత్రం అబ్దుల్ కలాం అంత ప్రభావం చూపిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుండి మేధావుల వరకు అందరూ కూడా ఆయనని ఆత్మీయుడు, మార్గదర్శిగానే భావిస్తారు. అయినప్పటికీ ఆయన తను నిత్య విద్యార్ధినేనని వినయంగా చెప్పుకొనేవారు. చెప్పుకోవడమే కాకుండా తనతో మాట్లాడే చిన్నారుల నుండి మేధావుల వరకు అందరి దగ్గర నుండి ఏదో ఒక కొత్త విషయం తెలుసుకొనే ప్రయత్నం చేసేవారు. అందుకే ఆయనని అందరూ ఆత్మీయుడుగా భావిస్తారు.