కేజ్రీలో ఖలేజా తగ్గిందా? ఎందుకు భయపడుతున్నాడు?
posted on May 4, 2017 3:19PM

ఆమ్ ఆద్మీ పార్టీలో అసమ్మతి తుఫాన్ ఎట్టకేలకు తీరం దాటింది. పార్టీకి గుడ్‌బై చెబుదామనుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్త మిత్రుడు, సీనియర్ నేత కుమార్ విశ్వాస్ మనసు మార్చుకున్నారు. కుమార్ విశ్వాస్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏజెంటంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే అమానతుల్లాఖాన్‌ను ఆప్ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీ వీడే ఆలోచన విరమించుకున్నారు.
కుమార్ విశ్వాస్ 30 మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళ్లిపోతున్నారంటూ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది. అమానతుల్లాఖాన్ ఆరోపణలను ఖండించిన కుమార్ విశ్వాస్.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం లేదంటూ పార్టీ అగ్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోకపోతే పార్టీని వీడతానంటూ హెచ్చరికలు పంపారు. దాంతో ఆప్‌లో కల్లోలం రేగింది. ఇప్పటికే ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కేజ్రీవాల్.... విశ్వాస్ డిమాండ్‌కు తలొగ్గారు. విశ్వాస్ కోరినట్లుగా ఎమ్మెల్యే అమానతుల్లాను పార్టీ నుంచి సస్పెండ్ చేసి... కుమార్ కు రాజస్థాన్ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.
అయితే అమానతుల్లా ఖాన్ హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతించారు. కేజ్రీవాల్ ఆదేశాల్ని శిరసావహిస్తానని చెప్పారు.