Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చైనాను కుదేలు చేస్తున్న త్రివిధ సంక్షోభం.!
posted on: Jul 6, 2026 5:48PM
.webp)
ఒకప్పుడు ప్రపంచానికే తయారీ కేంద్రంగా, తిరుగులేని ఆర్థిక శక్తిగా వెలిగిన డ్రాగన్ దేశం చైనా.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇది కేవలం ఏదో ఒక రంగంలో వచ్చిన తాత్కాలిక మందగమనం కాదు. స్థిరాస్తి, బ్యాంకింగ్, రుణ రంగాలు ఒకదానితో ఒకటి ముడిపడి సృష్టించిన త్రివిధ సంక్షోభంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ మితిమీరిన జోక్యం, లోపభూయిష్టమైన విధాన నిర్ణయాల కారణంగా చైనా ఆర్థిక పునాదులు కదలిపోతున్నాయి. ఐదు ప్రధాన బ్యాంకులు పతనం కావడం, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు నగదు కొరతతో అల్లాడిపోవడం, వృద్ధి రేటు గణనీయంగా క్షీణించడం వంటి పరిణామాలు చైనా అంతర్గత బలహీనతలను బయటపడుతున్నాయి. ఈ అసాధారణ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా, పొరుగున ఉన్న ఇండియాకు ఎలాంటి వ్యూహాత్మక అవకాశాలను, పాఠాలను అందిస్తున్నాయనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.
ప్రస్తుత సంక్షోభాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే చైనా సాధించిన గత వృద్ధి పథాన్ని ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. 1970ల నాటికి అత్యంత పేద దేశంగా ఉన్న చైనా, ఎగుమతుల ఆధారిత పారిశ్రామికీకరణను నమ్ముకుని అద్భుత ప్రగతిని సాధించింది. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తూ, 2008 నాటికి సుమారు 110 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ క్రమంలో దాదాపు 80 కోట్ల మంది జనంపేదరికం నుండి బయటపడ్డారు. అయితే.. 2008లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం చైనా ఎగుమతుల ఆధారిత నమూనాలోని లోపాలను బయటపెట్టింది.
పాశ్చాత్య దేశాలలో డిమాండ్ తగ్గడంతో చైనా కర్మాగారాలకు ఆర్డర్లు పడిపోయాయి, విదేశీ పెట్టుబడుల వృద్ధి రేటు ఒక్కసారిగా క్షీణించింది. కేవలం ఎగుమతులపైనే ఆధారపడితే దీర్ఘకాలిక మనుగడ సాధ్యం కాదని గ్రహించిన చైనా పాలకులు, దేశీయంగానే కృత్రిమ ఆర్థిక వృద్ధిని సృష్టించేందుకు వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం చేసిన ఒక పెద్ద పాలనా తప్పిదం ప్రస్తుత వినాశనానికి కారణమైంది. ఆర్థిక వ్యవస్థను వేగంగా ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం సుమారు 4 ట్రిలియన్ యువాన్ల భారీ ఉద్దీపన (బెయిల్ ఔట్) ప్యాకేజీని ప్రకటించింది. దేశీయ బ్యాంకులకు.. పారిశ్రామిక రంగానికి, స్థానిక ప్రభుత్వాలకు విచ్చలవిడిగా రుణాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వం విధించిన కఠినమైన వృద్ధి లక్ష్యాలను అందుకోవడానికి స్థానిక అధికారులు భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వచ్చింది.
కానీ అధికారిక బ్యాంకింగ్ నిబంధనలు, పరిమిత డిపాజిట్, రుణ వడ్డీ రేట్ల కారణంగా సాధారణ మార్గాల్లో నిధుల సేకరణ కష్టంగా మారింది. ఈ వృద్ధి లక్ష్యాల ఒత్తిడి, అధికారిక రుణాల కొరత కలిసి దేశంలో షాడో బ్యాంకింగ్' వ్యవస్థ విస్తరించడానికి దోహదం చేసింది. నియంత్రణ లేని ఆర్థిక లావాదేవీలకు కేంద్రంగా మారిన ఈ షాడో బ్యాంకింగ్ చైనాలో ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. సంప్రదాయ బ్యాంకింగ్ నిబంధనలు, రిస్క్ పరిమితులతో సంబంధం లేకుండా పనిచేసే బ్రోకర్లు, రుణదాతల నెట్‌వర్క్ ఇది. వ్యాపారాలు, స్థానిక సంస్థలు అత్యధిక వడ్డీ రేట్లకు ఇక్కడ రుణాలు తీసుకోవడం ప్రారంభించాయి. కాలక్రమేణా కొన్ని అధికారిక బ్యాంకులు సైతం తమ బ్యాలెన్స్ షీట్లలో చూపించకుండా ఈ సమాంతర వ్యవస్థ ద్వారా నిధులను మళ్లించాయి.
ఫలితంగా చైనా ఆర్థిక వ్యవస్థలో షాడో బ్యాంకింగ్ వాటా దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ పారదర్శికత లేని ఆర్థిక ప్రవాహం దేశాన్ని ఒక భారీ ప్రమాదంలోకి నెడుతోందని గ్రహించిన చైనా పాలకులు, 2016 నాటికి కఠినమైన రుణ నియంత్రణ చర్యలకు (డీలివరేజింగ్ ) శ్రీకారం చుట్టారు.. అయితే, ఒక్కసారిగా షాడో బ్యాంకింగ్ వనరులపై ఆంక్షలు విధించడంతో చైనా రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. చైనా జీడీపీలో దాదాపు 30 శాతం వాటా కలిగిన స్థిరాస్తి రంగం పూర్తిగా ఈ రుణాల పైనే ఆధారపడి నడిచేది. నిధుల కొరత కారణంగా ఎవర్‌గ్రాండే వంటి ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థలు వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయి. డెవలపర్లు నిధుల కోసం ప్రీ-సేల్స్ (నిర్మాణానికి ముందే అమ్మకాలు) విధానాన్ని నమ్ముకున్నారు. పూర్తికాని ఇళ్లకు భారీ తగ్గింపులు ప్రకటించడంతో కొనుగోలుదారులు కూడా సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలో ఉన్న వాటికే మొగ్గు చూపారు.
2018 నాటికి కొత్త ఫ్లాట్ల బుకింగ్స్ పెరిగినప్పటికీ, పూర్తయిన ఇళ్లు అమ్ముడుపోక నిధులు స్తంభించిపోయాయి. డెవలపర్లు పాత ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, కొత్త ప్రాజెక్టుల అడ్వాన్సులను వేరే చోటికి మళ్లించడంతో దేశవ్యాప్తంగా లక్షలాది నివాస సముదాయాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. తాము డబ్బులు చెల్లించినా ఇళ్లు చేతికి రావడం లేదని గ్రహించిన కొనుగోలుదారులు తమ హోమ్ లోన్ చెల్లింపులను నిలిపివేశారు. ఈ నిరసనలు, ఈఎంఐల ఎగవేత చైనా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. గృహాల ధరలు ఒకే సంవత్సరంలో 6 నుండి 7 శాతం పడిపోయాయి. రియల్ ఎస్టేట్ సంక్షోభం కాస్తా బ్యాంకింగ్ రంగానికి పాకడంతో హెనాన్ ప్రావిన్స్ వంటి ప్రాంతాల్లో గ్రామీణ బ్యాంకులు డిపాజిటర్ల సొమ్మును స్తంభింపజేశాయి.
తమ సొంత డబ్బు కోసం ప్రజలు వీధుల్లోకి వచ్చి హింసాత్మక నిరసనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనా బ్యాంకింగ్ రంగంలో సుమారు నాలుగో వంతు వాటా కలిగిన దాదాపు 4000 చిన్న బ్యాంకులు ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ సంక్షోభం దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కోలుకోలేని దెబ్బతీసింది. చైనా ఆర్థిక వ్యవస్థలో 60 శాతం వాటా ఉన్న ఈ సంస్థలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం నిలిపివేయడంతో ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. మరోవైపు, ఇళ్ల విలువలు పడిపోవడంతో సంపద ప్రభావం కారణంగా సాధారణ ప్రజలు తమ ఖర్చులను భారీగా తగ్గించుకున్నారు. వినోదం, ప్రయాణాలు, విలాస వస్తువుల కొనుగోళ్లు నిలిచిపోవడంతో అంతర్గత డిమాండ్ క్షీణించి వృద్ధి రేటు 2.99 శాతానికి పడిపోయింది. చైనా ఎదుర్కొంటున్న ఈ అంతర్గత సంక్షోభం అంతర్జాతీయ వ్యాపార సరళిని కూడా మారుస్తోంది.
చైనాతో భారతదేశానికి ఉన్న వాణిజ్య సంబంధాల విలువ సుమారు 28 శాతం తగ్గి 15.32 బిలియన్ డాలర్లకు చేరింది. చైనా ఆర్థిక నష్టాల ప్రభావం భారత్‌పై పడకుండా ఇదొక రక్షణ కవచంగా పనిచేస్తోంది. అంతేకాకుండా, డ్రాగన్ దేశంలో తయారీ రంగం కుంటుపడటం, అక్కడి ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. చైనాను కాదని బయటకు వచ్చే గ్లోబల్ కంపెనీలకు భారతదేశం ఒక సురక్షితమైన, ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది.
చైనా అనుభవాల నుండి భారతదేశం, ఇతర వర్ధమాన దేశాలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. మార్కెట్ శక్తుల సహజమైన గమనంలో ప్రభుత్వం మితిమీరి జోక్యం చేసుకోకూడదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. కృత్రిమంగా వృద్ధి రేటును పెంచేందుకు ప్రయత్నిస్తే అది వ్యవస్థాగత వినాశనానికి దారితీస్తుంది. ఒక పర్యావరణ వ్యవస్థలో సమతుల్యత దెబ్బతింటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో, ఆర్థిక వ్యవస్థలో కూడా నియంత్రణ లేని పరపతి విధానాలు అలాంటి ప్రమాదాలనే తెచ్చిపెడతాయి. ప్రభుత్వం ఎప్పుడూ ఒక వ్యాపారిలా కాకుండా పారదర్శకమైన నియమాలను అమలు చేసే పర్యవేక్షకుడిగా మాత్రమే ఉండాలి. భారతదేశం తన ఆర్థిక పటిష్టతను కాపాడుకుంటూ, మార్కెట్ క్రమశిక్షణను బలోపేతం చేయడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి అంతర్జాతీయ ఆర్థిక ఒడిదొడుకులను తట్టుకుని నిలబడగలుగుతుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
A triple crisis battering China, China economic crisis, China real estate crash, Shadow banking in China





