Latest News
ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఉక్కు పరిశ్రమ...ఈ నెల 23న శంకుస్థాపన
posted on: Mar 22, 2026 10:47AM

ఆంధ్రప్రదేశ్‌ను ‘భారతదేశ ఉక్కు రాజధాని’గా మార్చే దిశగా ప్రభుత్వం బలమైన స్టెప్ తీసుకుంది. ఏపీ పారిశ్రామిక రంగంలో కొత్త స్థాపించబోతున్న ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతుంది. గత 21 నెలల కూటమి ప్రభుత్వ కృషితో ఈ భారీ ప్రాజెక్టు సాకారం కాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేయనుంది. సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడులలో ఒకటి. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లి, పాయకరావుపేట, చుట్టుపక్కల ప్రాంతాల యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఉక్కు కర్మాగారం వస్తే దానిపై ఆధారపడే వందలాది చిన్న తరహా పరిశ్రమలు చుట్టుపక్కల ఏర్పడతాయి. తద్వారా పరోక్ష ఉపాధి భారీగా పెరుగుతుంది. ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ సంస్థలు ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ సంస్థలు అత్యంత ఆధునికమైన, పర్యావరణహితమైన సాంకేతికతను ఇక్కడ ఉపయోగించనున్నాయి. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులతో కలిసి ఈనెల 23వ తేదీన భూమిపూజ చేయనున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గత 21 నెలలుగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక విధానాలు, సులభతర వాణిజ్యం , వేగవంతమైన అనుమతుల వల్లే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. విశాఖపట్నం పోర్టుకు సమీపంలో ఉండటంతో ముడిసరుకు రవాణా , ఎగుమతులకు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా కీలకం.


.webp)



