చంద్రశేఖరుడు ముద్దు..చంద్రబాబు వద్దు..!

posted on: Aug 16, 2016 3:51PM

భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, అధికారులు హాజరయ్యారు. వీరందరితో పాటు అక్కడికి వచ్చిన వారందరి చూపు ఒక్కడి మీదే. ఆ ఒక్కరు వేరేవరో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు కానీ..రాష్ట్ర విభజన తర్వాత కానీ ఇంతవరకు ఆయన ఎట్‌హోం కార్యక్రమానికి హాజరుకాలేదు. అలాంటిది మొట్టమొదటిసారి జగన్ రాజ్‌భవన్‌కి వచ్చేసరికి రాజకీయ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నా సెంటార్ ఆఫ్ ఎట్రాక్షన్ మాత్రం జగనే. ఇదంతా బాగానే ఉంది కానీ..ఇక్కడే నలుగురిలో ఉన్నపుడు ఎలా ఉండాలో తనకు తెలియదనే విషయాన్ని జగన్ చూపించుకున్నారు.

 

ఎట్‌హోం కార్యక్రమానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే సమయంలో హాజరవ్వటమే కాకుండా జగన్ కూడా అదే సమయంలో హాజరవ్వటం విశేషం. చంద్రబాబు, జగన్ వ్యవహారం ఉప్పు-నిప్పులా ఉంటున్న కారణంగా సాధారణంగా ఇద్దరూ పాల్గొనాల్సిన కార్యక్రమాల్లో ఒకరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే ఇంకోరు వస్తున్నారు. అయితే, ఎట్‌హోంకు మాత్రం ఇటు చంద్రబాబు అటు జగన్ ఒకేసారి హాజరయ్యారు. దాంతో ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. దానికితోడు జగన్ నవ్వు మొహంతో గవర్నర్ సతీమణి విమలానరసింహన్‌తో ఎంతో కలివిడిగా మాట్లాడారు. అదేవిధంగా గవర్నర్‌తో కూడా ముచ్చట్లు చెప్పారు.

 

అదేసమయంలో చంద్రబాబు కూడా వారున్న హాలులోకి వచ్చారు. దాంతో జగన్‌తో మాట్లాడుతున్న గవర్నర్ వెంటనే చంద్రబాబును ఆహ్వానించటమే కాకుండా చంద్రబాబుకు జగన్‌ను చూపించారు. దాంతో ఒకరికి మరొకరు నమస్కారాలు చేసుకున్నారు. అనంతరం జగన్ ముందు నుండి వెళ్ళిపోతున్న చంద్రబాబును అక్కడే ఉన్న శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి ఆపి మళ్ళీ జగన్ వద్దకు తీసుకుని వచ్చారు. దాంతో ఇద్దరూ షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే అదే సమయంలో కేసీఆర్‌‌తో మాత్రం జగన్ ఆత్మీయంగా మెలిగారు. కేసీఆర్ కనపించగానే ఆయనతో కరచాలనం చేసి..నవ్వుతూ మాట్లాడుకున్నారు. అదే స్పూర్తి చంద్రబాబుతో మాత్రం చూపించలేకపోయారు జగన్.

 

అక్కడున్న వారంతా ఇదే విషయంపై చెవులు కొరుక్కోవడంతో చక్రపాణి అలర్టై జగన్‌ను వెనక్కిలాగి చంద్రబాబుతో కరచాలనం చేయించకుండా ఉండి ఉంటే సీన్ ఇంకోలాగా ఉండేది. ఎన్ని విభేదాలున్నా..ఎంత ఆగర్భ శత్రువులైనా..ఎదుట పడితే వారికి చేతులు జోడించి నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అయితే జగన్ మాత్రం కోరి వైరం తెచ్చుకున్నట్లు ఇలా వ్యవహరించడం చేయడం సరికాదంటున్నారు. ఆయన్ను చూసిన ప్రతిఒక్కరు జగన్ ఇంకా ఎదగలేదబ్బా అనుకుంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...