ఆంధ్రప్రదేశ్.. 55 ఏళ్లలో 61 తీవ్ర తుపానులు!
posted on Oct 29, 2025 1:30PM

ఈశాన్య రుతుపవనాల సీజన్ ను తుఫాన్ల సీజన్ అనడం కద్దు. ఈ సీజన్ లొ సుముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలుగా, తీవ్ర వాయుగుండాలుగా, తుఫాన్లుగా, తీవ్ర తుపానులుగా బలపడి అపార నష్టం కలిగిస్తుంటాయి. దేశంలోనే అత్యధిక పొడవైన సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు తుపాన్ల బెడద ఎక్కువే. తాజాగా మొంథా తుపాన్ మంగళవారం మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటింది. ఇది రాష్ట్రాన్ని వణికించేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం జరగలేదు. ఆస్తినష్టాన్ని కూడా ప్రభుత్వ చర్యలు కనిష్టానికి తగ్గించగలిగాయి. ఒక విధంగా ప్రకృతిలో ప్రభుత్వం యుద్ధం చేసి విజయం సాధించిందని చెప్పవచ్చు. అయితే గతంలో సంభవించిన పలు తుపానులు అపార నష్టాన్ని కలిగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం.
గడిచిన 55 సంవత్సరాల్లో గణాంకాలను పరిశీలిస్తే 1970 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్ ను 61 తుఫాన్లు తాకాయి. వీటిలో 1977లో వచ్చిన దివిసీమ ఉప్పెన అత్యధిక ప్రాణనష్టం కలిగించింది. ఆ సమయంలో సంభవించిన ఉప్పెన దాదాపు పది వేల మంది ప్రాణాలను హరించింది. ఇప్పటికీ దివిసీమ ఉప్పెన అంటే రాష్ట్రంలోని ఒక తరం జనం భయంతో వణికిపోతుంటారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో విశాఖను తాకిన హుద్ హుద్ తుపాను మరో చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ తుపాను దాదాపు 40 మందిని పొట్టన పెట్టుకుంది. వారం రోజులు పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు చీకట్లో మగ్గిపోయాయి. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు దాదాపు వారం రోజులు విశాఖలోనే బస చేసి సహాయక చర్యలు పర్యవేక్షించారు. కేకే లైన్ లో చిముడుపల్లి వద్ద రైల్ ట్రాక్ కొట్టుకుపోవడంతో దాదాపు 50 రోజులు పాటు విశాఖ అరకు మధ్య రైళ్ల రాకపోకలునిలిచిపోయాయి. అంతకు ముందు 1996లో సంభవించిన తుపాను కోనసీమలో బీభత్సం సృష్టించింది. కాకినాడ, యానాం మధ్య తీరం దాటిన ఆ తుపాను కారణంగా సంభవించిన ఉప్పెన వెయ్యి మందికి పైగా ప్రణాలను హరించింది. ఇక ఆస్తినష్టం గురించి చెప్పనవసరమే లేదు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో తీరం దాటిన తుపాన్ల జాబితా ఇలా ఉంది.
*2025 అక్టోబర్ 28 న మెంథా తుఫాను.
*2023లో మించౌంగ్ తుఫాను బాపట్ల వద్ద తీరాన్ని తాకింది.
* 2022 లో మాంథాస్ తుఫాను.
* 2022లో అస్సాని తుఫాను మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటింది.
* 2020లో నివార్ అనే తుఫాను ఏపీ తీరాన్ని రెండుసార్లు తాకడంతో భారీ నష్టం జరిగింది.
* 2018 పితాయి తుఫాను కాట్రేటి కోన వద్ద తీరాన్ని తాకింది.
* 2018లో తితిలి తుఫాన్ శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద తీరాన్ని తాకి భారీ నష్టం కలిగించింది.
*2013లో పితాని తుఫాను ఒడిస్సా వద్ద తీరాన్ని తాకింది. అయితే దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ నష్టం జరిగింది
* 2012లో తమిళనాడు వద్ద నీలం తుఫాను తీరం తాకింది అయితే దీని ప్రభావం వలన చిత్తూరు తో పాటు రాయలసీమ జిల్లాలకు భారీ నష్టం జరిగింది
* 2010లో లైలా తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని తాకింది
*2006లో అగ్ని తుఫాన్ ఒంగోలు మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకింది.
* 2006లో కైమస్ తుఫాను కావలి వద్ద తీరం తాకడంతో భారీ నష్టం జరిగింది.
అలా ఏపీ తీరాన్ని ఈశాన్య రుతుపవనాల సమయంలో వచ్చే తుఫాన్లు భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయి ఈసారి వచ్చిన తుఫాను సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంతో చాలావరకు నష్టం తీవ్రత తగ్గిందని చెప్పవచ్చు