సౌదీ బస్సు ప్రమాదం..ఒకే కుటుంబంలో ఏకంగా 18 మంది మృతి

ఏడ‌వ‌డానికి కూడా మ‌నుషులు మిగలకుండా ఓ కుటుంబం మొత్తం మృత్యు ఒడికి చేరింది. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో ఆ కుటుంబంలో మిగిలిన ఒకరిద్దరిలో కూడా.. తాము ఇంక ఎవరి కోసం, ఎందుకోసం బతకాలన్న నైరాశ్యం. వైరాగ్యం. చ‌నిపోయాక అంద‌రూ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లే వాళ్లే. కానీ..  ఒకేసారి అంద‌రూ దేవుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతే ఇక ఆ కుటుంబ‌మే లేకుండా పోతుంది. అదే జ‌రిగింది హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ కి చెందిన న‌సీరుద్దీన్ కుటుంబంలో.

రిటైర్డ్ రైల్వే ఉద్యోగి న‌సీరుద్దీన్ కుటుంబం న‌వంబ‌ర్ 9న సౌదీకి వెళ్లారు. ఆయ‌న భార్య అత్త‌ర్ బేగం, కొడుకు స‌ల్లావుద్దీన్, అత‌డి భార్య ఫ‌లానా.. వీరి ముగ్గురు పిల్ల‌లు జైన్,  ఫ‌రీదా, శ్రీజ ఉన్నారు. అలాగే న‌సీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ అమెరికాలో ఉంటాడు. అత‌డి భార్య స‌న‌, వీరి ముగ్గురు పిల్ల‌లు మొహ‌రీన్, మోజా, అజ‌ర్ సైతం యాత్ర‌కు వెళ్లారు.  నజీరుద్దీన్ కి ఇద్ద‌రు కొడుకులు.. ముగ్గురు ఆడ‌పిల్ల‌లున్నారు. వారు అమీనా బేగం, షమీనా బేగం, రిజ్వానా బేగం. వీరు సైతం హ‌జ్ యాత్ర‌కు వెళ్లారు. అమీనా బేగం కూతురు హనీష్ కూడా వీరితో పాటు వెళ్లారు. ఇక‌ షబానా బేగం కుమారుడు జాఫర్ సైతం యాత్ర‌కు వెళ్లాడు. రిజ్వానా బేగం పిల్లలు మరియాన, సహజ కూడా ఉమ్రాకు వెళ్లారు. ఈ మొత్తం 18 మంది ఒకేసారి సౌదీలో జరగిన ఘోర బస్సు   ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతి చెందారు.  

దీంతో విద్యాన‌గ‌ర్ ప్రాంత‌మంతా ఒక్క‌సారిగా విషాద చ్ఛాయ‌ల్లో కూరుకుపోయింది. ఒక చెట్టు నుంచి ఒక ప‌క్షుల గుంపు గుంపే ఎగిరిపోతే ఆ చెట్టు ఎంత బోసిపోతుందో.. ఒక ప్రాంతం నుంచి ఇంత మంది పెద్దా చిన్నా మొత్తం ప్రాణాలు కోల్పోతే.. ఆ ప్రాంగ‌ణం మాత్ర‌మే కాదు, ఆ  ప్రాంత‌మంతా కూడా  ఒక్క‌సారిగా స్మ‌శాన  వైరాగ్యం అలుముకుంటుంది. ప్ర‌స్తుతం ఇక్క‌డి ప‌రిస్థితి అలాగే ఉంది.  ఇంట్లోని అంద‌రూ ఒక్క‌సారిగా వెళ్లిపోతే.. మిగిలిన ఆ ఒక‌రిద్ద‌రికి ఏం చేయాలో పాలు పోని ప‌రిస్థితి ఎదురు కాక త‌ప్ప‌దు. ఇది జీవితాంతం వెంటాడి వేటాడే విషాదం. ఇది విద్యాన‌గ‌ర్ ప్రాంతానికే కాదు హైద‌రాబాద్ మొత్తం అలుముకున్న విషాదం. 

బస్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన 45 మందిలో.. 18 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డం ఒక విషాదం కాగా.. వారిని క‌డ‌సారి చూసుకోడానికి కూడా వీల్లేని విధంగా మ‌దీనాకు స‌మీపంలోని స్మ‌శానంలో అంత్యక్రియ‌లు నిర్వ‌హించ‌డం మ‌రో దారుణం. ఇది ప‌గ‌వాడికి కూడా రాకూడని  దుస్థితి.. వారి ఆత్మ‌ల‌కు శాంతి చేకూర్చాల‌ని మ‌న‌మంతా క‌ల‌సి ఆ భ‌గ‌వంతుడ్ని ప్రార్ధించ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌గ‌లం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu