దేశ వ్యాప్తంగా 100 ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు

posted on: Jun 2, 2026 2:56PM

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రేట్ స్కీమ్.. భారత తయారీ రంగానికి ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి ద్వారా సమీకృత మౌలిక సదుపాయాలను, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని,  ఉపాధి అవకాశాలను విస్తరించాలన్నది ఈ పథకం  ప్రధాన ధ్యేయం. ఆరు సంవత్సరాల్లో  రూ.33,660 కోట్ల ఆ వ్యయంతో వంద‌ పారిశ్రామిక పార్కులు,  ప్రపంచ ప్రమాణాల పారిశ్రామిక మౌలిక సదుపాయాలు.. ఇవీ  ఈ భవ్య పథకంలోని కీల‌కాంశాలు.

ఇక ఈ ప‌థ‌కం రూప‌క‌ల్ప‌న  విష‌యానికి వ‌స్తే..  మేక్ ఇన్ ఇండియా, పీఎం గతి శక్తి లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ పథకం.. ఇండియాని   ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే వ్యూహాత్మక ప్రయత్నంగా నిలుస్తోంది. 2026-27 నుంచి 2031-32 వరకు ఆరేళ్లలో సుమారు  33,660 కోట్ల రూపాయల వ్యయంతో 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. మొదటి దశలో ఛాలెంజ్  బేస్డ్ ప్ర‌క్రియ‌ ద్వారా 50 పార్కులను ఎంపిక చేయనున్నారు.

ఈ విధానం కేవలం భూమి కేటాయింపునకు మాత్రమే పరిమితం కాకుండా..  మౌలిక వసతులు, పాలనా నాణ్యత,  అమలు సామర్థ్యాన్ని ఆధారంగా తీసుకుంటుంది. అంటే..  పార్కు ఏర్పాటు కావడం కంటే, అది నిజంగా పనిచేయడం ముఖ్యమన్న  సంకేతాన్నిస్తోంది కేంద్ర‌ ప్రభుత్వం.

ఈ పథకంలో  పెట్టుబడికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను రూపొందించాలన్న లక్ష్యం అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది. ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు, మ‌ల్టీ ట్రాన్స్ పోర్టేజేష‌న్ క‌నెక్టివిటీ, క్రెడిబిలిటీ  గ‌ల‌ యుటిలిటీలు, కార్మికులు అక్క‌డే నివ‌సించే విధంగా గృహ వసతి, డిజిటల్ పాలనా వ్యవస్థలు, సుస్థిరాభివృద్ధి లక్షణాలు ఈ పార్కు రూప‌క‌ల్ప‌న‌లో అత్యంత కీల‌కంగా ఉంటాయి.

ఇలాంటి మోడ‌ల్ ఉంటే పరిశ్రమలు, భూమి, విద్యుత్, నీరు, మురుగునీటి శుద్ధి, అనుమతులు వంటి ప్రాథమిక అడ్డంకులపై సమయం వృథా చేయకుండా నేరుగా ఉత్పత్తిపై దృష్టి పెట్టగలవు. ఇది ముఖ్యంగా చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల  వ్యయాన్ని, సమయాన్ని రెండింటినీ తగ్గించగలదు.

ఈ పథకం కింద..  భూగర్భ వినియోగ వ్యవస్థలు, నీటి, వ్యర్థాల నిర్వహణ, ఉమ్మడి మురుగునీటి శుద్ధి కేంద్రాలు, పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలు, కార్మికుల గృహ వసతి,   ప్రయోగశాలలు,  డిజిటల్ సింగిల్-విండో క్లియరెన్స్ వ్యవస్థలు, నైపుణ్యాభివృద్ధి సౌకర్యాలు వంటి అంశాలకు ప్రాధాన్య‌త‌ ఇవ్వనున్నారు.

ఈ నిర్మాణం చూస్తే..  ఇది కేవలం పరిశ్రమల కోసం భూమిని సిద్ధం చేయడం కాదు.. పూర్తి ఇండ‌స్ట్రియ‌ల్ ఎకో సిస్ట‌మ్ తయారు చేయడం అన్నమాట. దేశీయ స‌ప్ల‌య్ చైన్ బలపడాలన్నా, ఎగుమతులు పెరగాలన్నా, ఇలాంటి సమగ్ర మౌలిక వ్యవస్థ తప్పనిసరి.

పరిశ్రమలకు కేవ‌లం భూమి మాత్రమే కాదు..  పనిచేసే వ్యవస్థ అందించాలన్నదే ఈ పథకంలోని అసలైన దృష్టి కోణం. కొండ ప్రాంతాలు కాని రాష్ట్రాలకు కనీసం 100 ఎకరాల భూమి అవసరం కాగా..  కొండ ప్రాంత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, చిన్న రాష్ట్రాలకు 25 ఎకరాల కనీస పరిమితిని నిర్ణ‌యించారు. 

అదే సమయంలో వెయ్యి ఎకరాల వరకు ఉన్న.. పెద్ద పార్కులను కూడా పరిగణనలోకి తీసుకోవ‌డం ద్వారా, అవసరాన్ని బట్టి విస్తరణకు అవ‌కాశాన్ని క‌ల్పించారు. ఇది రెండు విధాలుగా.. ఉపయోగపడుతుంది. ఒకవైపు చిన్న రాష్ట్రాలు కూడా రంగంలోకి రావచ్చు. మరోవైపు భారీ పెట్టుబడులు కోరే రాష్ట్రాలు పెద్ద పార్కులతో ముందుకు వెళ్లవచ్చు. ఇలా భౌగోళిక వైవిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం, కేంద్ర విధానానికి ఒక సౌలభ్యాన్ని తీసుకొస్తుంది.

ఈ పథకంలో నిధులను ఈక్విటీ వాటాల‌ రూపంలో అందించనున్నారు. SPVలకు బదిలీ చేసిన భూమి విలువకు అనుసంధానించిన మద్దతు, ప్రాజెక్టు మైలురాళ్ల సాధనకు సంబంధించిన ప్రోత్సాహకాలు, ప్రైవేట్ డెవలపర్ల భాగస్వామ్యానికి నిర్మాణాత్మక నిబంధనలు ఇందులో భాగమవుతున్నాయి.

ఇది సాధారణ గ్రాంట్ మోడల్ కంటే మరింత మెరుగైన‌ పనితీరు క‌లిగిన‌ విధానం. అంటే..  డబ్బు ఇవ్వడమే కాకుండా, ఫలితాల పట్ల బాధ్యతను కూడా కట్టుదిట్టంగా ఉంచుతార‌న్న‌మాట‌. ఈ మోడల్ అమలులో సవ్యంగా నడిస్తే, వృథా వ్యయం తగ్గి, ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుంది.

ఎన్ఐసీడీసీ ని ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీగా నియమించడం, అలాగే డీపీఐఐటీ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం, ఈ పథకానికి పాలనా బలాన్ని ఇస్తుంది. జీఐఎస్ ఆధారిత పర్యవేక్షణ, పీరియాడిక్ ప్రోగ్రెస్ రిపోర్టులు, ఆడిట్ యంత్రాంగాలు, పారదర్శకతకు సంబంధించిన  సేఫ్టీ మెజ‌ర్మెంట్స్ గా  తెలుస్తోంది.

పెద్ద పథకాలు కాగితంపై గొప్పగా కనిపించడం సులభం. కానీ వాటి నిజమైన పరీక్ష.. గ్రౌండ్ లెవ‌ల్లో పనులు ఎంత వేగంగా, ఎంత నాణ్యంగా, ఎంత పారదర్శకంగా జరుగుతాయన్నదే . దీంతో డిజిటల్ పర్యవేక్షణను బలంగా చేర్చడం ఒక కీలక పరిణామంగా తెలుస్తోంది.

ఈ గ్రేట్ ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ.. కేవలం పారిశ్రామిక మౌలిక సదుపాయాల పథకం మాత్ర‌మే కాదు. అది భారత ఆర్థిక వ్యూహంలోని మెయిన్ పిల్ల‌ర్ కూడా. వ‌ర‌ల్డ్ స‌ప్లై చైన్ రీజ‌న‌రేట్ అవుతోన్న‌ ఈ కాలంలో, పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న పార్కులు విదేశీ, దేశీయ పరిశ్రమలకు ఒక ఆహ్వానంలాంటివి అవుతాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రసాయనాలు, ఎగుమతి.. తయారీ రంగాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.ఇలాంటి పార్కులు స్థానిక ఉపాధిని పెంచడమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, రాష్ట్రాలకు పోటీదారులుగా ఉండే అవకాశాన్ని అందిస్తాయి. రాష్ట్రాల మధ్య పారిశ్రామిక పోటీ మరింత తీవ్ర త‌రం చేయ‌డం ఖాయం.

అయితే, ఈ పథకం విజయవంతం కావాలంటే.. కొన్ని కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. భూ సేకరణ, అనుమతులు, రాష్ట్ర–కేంద్ర సమన్వయం, ప్రైవేట్ భాగస్వామ్య ఆకర్షణ, వాస్తవిక సమయపాలన  ఇందులోని ప్రధాన అంశాలు. ఒకసారి పార్కు స్థాపన జరిగినంత మాత్రాన పరిశ్రమలు ఆటోమేటిక్‌గా రాకపోవచ్చు. వాటికి నమ్మకం, సౌలభ్యం, ఇత‌ర‌త్రా విధాన స్థిరత్వం కావాలి. అందువల్ల, ఈ గ్రేట్ ఇండ‌స్ట్రియ‌ల్ స్కీమ్ కేవలం ప్రకటనగా కాకుండా, నిరంతర అమలు, సమర్థ సమన్వయం, కట్టుదిట్టమైన ఫలితాలను రాబ‌ట్ట‌డం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...