ట్రంప్ వార్నింగ్‌లు... లెక్క చేయని అమెరికా ఓటర్లు
posted on Nov 5, 2025 2:08PM

భారత్ మూలాలు ఉన్న నేతలు అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. భారత సంతతికి చెందిన డెమాక్రెటిక్ నేత జొహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ నాయకురాలు గజాల హష్మీ విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈమె హైదరాబాద్ మూలాలున్న మహిళ కావడం విశేషం.
ఆ క్రమంలో అమెరికాలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. న్యూయార్క్ నగర మేయర్‌గా డెమాక్రెటిక్ పార్టీ నేత, భారత సంతతికి చెందిన జొహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు. జొహ్రాన్ ఎన్నికైతే నిధులు నిలిపివేస్తామన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఖాతరు చేయని న్యూయార్క్ ప్రజలు మమ్దానీకే పట్టం కట్టారు. నగర మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మమ్దానీ చరిత్ర సృష్టించారు. ఆఫ్రికాలో జన్మించిన మమ్దానీకి ప్రజలు నగర పగ్గాలు అందించడం ఈ ఎన్నికల్లో ఆవిష్కృతమైన మరో విశేషం. కేవలం 34 ఏళ్ల వయసులోనే జొహ్రాన్ మమ్దానీని మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గత వందేళ్లల్లో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు.
ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలున్న వ్యక్తులే. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ. భారత దిగ్గజ దర్శకుల్లో ఆమె ఒకరు. ‘సలామ్ బాంబే’, ‘మాన్‌సూడ్ వెడ్డింగ్’ వంటి ప్రముఖ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తండ్రి మహ్మద్ మమ్‌దానీ గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహ్మద్ మమ్‌దానీ ఆ తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ నాయకురాలిగా ఎన్నికైన గజాల హష్మీ హైదరాబాద్ మూలాలున్న మహిళ కావడం విశేషం. గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. బాల్యంలో మలక్‌పేటలోని తన అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించారు. ఆమె తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక విభాగంలో పనిచేశారు. నాలుగేళ్ల ప్రాయంలో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా.. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ చదివారు.