Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే నేతలకు డబుల్ ఫైన్ : హోంమంత్రి అనిత
posted on: May 6, 2026 3:07PM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు నిబంధనలను అతిక్రమిస్తే సామాన్యుల కంటే రెట్టింపు స్థాయిలో శిక్ష ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత ఆదర్శంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ‘సురక్షిత రోడ్లు-సురక్షిత జీవితం’ కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆమె స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఏ రకమైన మినహాయింపులు ఉండకూడదని అధికారులకు సూచించారు.
రాజకీయ నాయకులు లేదా ప్రజాప్రతినిధులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే, వారికి విధించే చలానా మొత్తాన్ని రెట్టింపు చేయాలని అనిత ప్రతిపాదించారు. ఎవరైనా నాయకుడు రూల్స్ బ్రేక్ చేసి పోలీసులకు దొరికితే, తనను విడిపించమని సిఫార్సులు చేసినా సరే వెనక్కి తగ్గవద్దని పోలీసులకు భరోసా ఇచ్చారు. ఇలాంటి కఠిన నిర్ణయాల వల్ల సమాజంలో ఒక మంచి సందేశం వెళ్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
లక్షల రూపాయలు వెచ్చించి బైక్‌లు కొనుగోలు చేసే యువత, కేవలం వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ కొనడానికి వెనకాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఈ ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయని, కనీసం ఇకనైనా వాహనదారులు మేల్కోవాలని ఆమె పిలుపునిచ్చారు.
హోంమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజకీయ నాయకులు ట్రాఫిక్ పోలీసులకు దొరికితే తమ పలుకుబడిని ఉపయోగించి తప్పించుకోవాలని చూస్తుంటారు. కానీ హోంమంత్రి స్వయంగా వారికి రెట్టింపు జరిమానా విధించాలని చెప్పడం పోలీసు వర్గాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు.
రానున్న రోజుల్లో ఈ నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, రోడ్డు భద్రతపై ప్రతి విద్యాసంస్థలోనూ, కార్యాలయాల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. హోంమంత్రి తీసుకున్న ఈ చొరవతో ఏపీ రోడ్లపై ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.



.webp)


