రాజ్ భవన్ కి ... మోత్కుపల్లి ఇంకెంత దూరం?
posted on Sep 7, 2016 4:11PM

రాష్ట్ర విభజన తరువాత టీ టీడీపి గురించి మాట్తాడితే చాలు వినిపించే పేరు మోత్కుపల్లి నర్సింహులు! రేవంత్ రెడ్డితో పాటూ ఆయన తెలంగాణ టీడీపికి కష్ట కాలంలో అండగా నిలబడ్డాడు. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో తెలంగాణాలో గట్టిగా నిలబడిన టీడీపీ లీడర్లు చాలా తక్కువ మంది. వారిలో మోత్కుపల్లి అత్యంత ప్రముఖుడనే చెప్పాలి. అయితే ఆయన పార్టీ పట్ల చూపిన విధేయతకుగాను గవర్నర్ అవుతారని ఎప్పట్నుంచో టాక్... మోత్కుపల్లి గవర్నర్ అనే వార్త ఇప్పటికే చాలా సార్లు వచ్చింది. అసలు సోషల్ మీడియాలో అయితే టీడీపి అంటే పడని వారు, మోత్కుపల్లి ప్రత్యర్థులు ... దీనిపై అనేక సెటైర్లు వేస్తున్నారు. అయినా కూడా నిప్పు లేనిదే పొగరాదన్నట్టు గవర్నగిరి వార్తలు మాత్రం వస్తూనే వున్నాయి!
తెలంగాణ ఉద్యమ కాలంలో, తరువాత కూడా టీ టీడీపీ అనేక విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. టీఆర్ఎస్ తన దృష్టంతా టీడీపీ పైనే పెట్టింది. అటువంటి గడ్డు కాలంలో కూడా మోత్కుపల్లి పార్టీ జెండా వదలకుండా పోరాడాడు. ఎన్నో నిందలు కూడా భరించాడు. అందుకే, చంద్రబాబు ఆయనకు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ తో మాట్లాడి గవర్నర్ పదవి ఇప్పించాలని నిర్ణయించారు. కాని, ప్రత్యేక హోదా విషయంలో పదే పదే టీడీపీకి, ఎన్డీఏకి భేదాభేప్రాయాలు రావటంతో మోత్కుపల్లి ఇష్యూ కూడా వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు ప్రత్యేక హోదా కాస్తా ప్రత్యేక ప్యాకేజ్ గా రూపు మార్చుకుని గొడవ సద్దుమణిగేటట్టుగా వుంది!
ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ అయితే మోత్కుపల్లి గవర్నర్ అంశం కూడా ముందుకు కదులుతుందా? అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. ఇంతకాలం ఏపీకి రావాల్సిన వరాలపై తర్జభర్జన జరగటంతో తమ నేత ఆశలు కూడా డోలాయమానంలో పడ్డాయని, ఇప్పుడిక అలాంటిది వుండదని అంటున్నారు. చూడాలి మరి... మోత్కుపల్లి పార్టీ విధేయతకి, స్వామి భక్తికి గవర్నర్ పదవి నజరానాగా లభిస్తుందో లేదో...