Latest News
టీటీడీలో ప్రసాదాల కల్తీని గుర్తించే అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబ్ సిద్ధం!
posted on: Mar 20, 2026 7:58PM

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సిద్దమైన స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీని సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు. శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత, నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో సూక్ష్మ స్థాయిలో కల్తీ జరిగినా పసిగట్టే పరీక్షలు ఈ అత్యాధునిక ల్యాబ్ లో జరుగుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. పుణ్య క్షేత్రాల్లో ఈ తరహా ఫుడ్ లేబరేటరీ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. నూనె, పాలు, నెయ్యిలో ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలను కూడా ఈ ల్యాబ్ లో గుర్తిస్తారని తెలిపారు. కెమికల్ ఎనాలిసిస్, మైక్రోబయాలజీ ఎనాలిసిస్ పరీక్షలకు అనుగుణంగా పరికరాలు యంత్రాలను ల్యాబ్ లో సమకూర్చామని పేర్కొన్నారు.
మంత్రి సత్యకుమార్ చొరవతో కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి..!
మంత్రి సత్యకుమార్ సమక్షంలో అక్టోబర్ 8, 2024న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ)తో న్యూఢిల్లీలో రాష్ట్ర అధికారులు చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి తిరుమలలో 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఫుడ్ ల్యాబరేటరీ ఏర్పాటైంది. పలు పుణ్యక్షేత్రాల్లో ల్యాబ్స్ ఏర్పాటుపై ఎఫ్ఎస్ఎస్ఏఐతో సదరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగినా కార్యాచరణ మాత్రం తిరుమలతోనే సాధ్యమైంది.
9 నెలలకు...
కిందటేడాది జూన్ 1 నుంచి ప్రారంభమైన ల్యాబ్ ఏర్పాటు పనులు ఇటీవలే పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ల భాగస్వామ్యంతో టీటీడీ సహకారంతో ఈ ల్యాబరేటరీ ఏర్పాటుకు ఒడిఒడిగా అడుగులుపడ్డాయి. గతంలో చోటుచేసుకున్న కల్తీ ఘటనలు దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా తిరుమలలో ల్యాబ్ కు సుమారు రూ.25 కోట్ల వరకు వ్యయమవుతోంది. టీటీడీ స్థలానివ్వగా.. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చింది
ఇందులో సుమారు రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలను ల్యాబ్ లో సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ల్యాబ్ కూ ట్రాన్సఫార్మర్, జనరేటర్ సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. త్వరలో రూ.3 కోట్లతో ప్రాన్స్ నుంచి ఈ-నోస్, ఈ-టంగ్ యంత్రాలు రాబోతున్నాయని తెలిపారు. ఇవి వాసన, రుచి లో తేడాలను గుర్తిస్థాయన్నారు. చిన్న పెద్దా కలిపి 50 పరికరాలు/యంత్రాలు ఉన్నాయి. ఆహార పదార్థాల్లో సేకరించిన ఒక్కో నమూనాను పదుల సంఖ్యలో పరీక్షించే సామర్థ్యం ల్యాబ్ కు ఉంది. ముడి సరుకులు, ఇతర నమూనాల విషయాల్లోనూ ఇలాగే పరీక్షలు జరుగుతాయి. గరిష్టంగా ఒక నమూనా ద్వారా 50 రకాల పరీక్షలు చేయడానికి వీలుoది.
ప్రసాదాలు, జల, ముడి సరకుల నమూనాల పరీక్షలు!
కొత్తగా ఏర్పాటైన ల్యాబ్లో ప్రసాదాలు, వాటికి వినియోగించే ముడిసరకుల్లో పురుగు మందుల అవశేషాలు, భారలోహాలు, క్రిమికీటకాలు, వంటి వాటి గురించి నమూనాలు పరీక్షించడం ద్వారా తెలుసుకుంటారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, క్రిస్మిస్, బాదంపప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు కారం వంటి నమూనాలను ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు. జలప్రసాదాల నమూనాలను సైతం ఇక్కడ పరీక్షిస్తారు. నెయ్యి, నూనెలో ఉండాల్సిన కొవ్వుల శాతం, వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు వంటివాటిని సులువుగా గుర్తిస్తారు లడ్డూల్లో ఎనర్జీ లెవల్స్, వాడిన నెయ్యిని, ఆహారంలో బ్యాక్టీరియా ఉందా? లేదా? కూడా ఈ ల్యాబ్లో పరీక్షిస్తారు.
ఇప్పటివరకు...
తిరుమలలో 1981లో వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబరేటరీ ఏర్పడింది. 1988లో దీనిని ఉన్నతీకరించి, ఆహార పదార్ధాల నమూనాలు పరీక్షించడం ప్రారంభించారు. 2018లో దీనికి ఎనబీఎల్ అక్రిడిటేషన్ లభించింది. ఈ ల్యాబ్లో సాధారణ స్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయి



.webp)


