థోరియం నిల్వలు..ఆరోపణలు వాస్తవాలు.. సాంకేతిక సవాళ్లు!

posted on: Apr 14, 2026 9:39AM

కంఠమనేని సీతారాం

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా దేశంలో   థోరియం నిల్వలకు సంబంధించి భారీ ఎత్తున కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.  గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 60 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద అక్రమంగా విదేశాలకు తరలిపోయిందనీ, దీనివల్ల దేశం భారీగా నష్టపోయిందని ఈ కథనాల సారాంశం. ముఖ్యంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వంటి అగ్రనేతల నిర్ణయాల వల్ల భారత అణు ఇంధన స్వయంప్రతిపత్తి దెబ్బతిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వివాదానికి ప్రధాన కేంద్రం   దేశ తీరప్రాంతాల్లో లభించే  మోనాజైట్ అనే ఖనిజం. ఇందులో థోరియం నిల్వలు పుష్కలంగా ఉంటాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రైవేట్ సంస్థలు జరిపిన బీచ్ సాండ్ మైనింగ్‌లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. దీనిపై గతంలోనే కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి, కొన్ని సంస్థలపై కేసులు కూడా నమోదు చేశాయి. అయితే..  సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లక్షల కోట్ల రూపాయల నష్టం అనే అంకెకు సంబంధించి ఏ ప్రభుత్వ సంస్థ లేదా కాగ్   ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నివేదికను విడుదల చేయలేదు.

భారతదేశం భవిష్యత్  అణు విద్యుత్ అవసరాల కోసం మూడు దశల అణు కార్యక్రమాన్ని రూపొందించుకుంది. ఇందులో థోరియం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ..  థోరియం ఆధారిత రియాక్టర్ల నిర్మాణం అనేది అత్యంత సంక్లిష్టమైన, భారీ వ్యయంతో  కూడుకున్న ప్రక్రియ. ప్రస్తుతం ఈ సాంకేతికత అభివృద్ధిలో జాప్యం జరగడానికి ప్రధానంగా శాస్త్రీయ,  భద్రతా పరమైన సవాళ్లే కారణమని నిపుణులు అంటున్నారు. దీనిని కేవలం రాజకీయ కోణంలో చూడటం సరికాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు..  చైనా వంటి దేశాలు భారత్ నుండి అక్రమంగా థోరియం పొంది వేల ఏళ్ల పాటు తమ విద్యుత్ అవసరాలను తీర్చుకోబోతున్నాయనే వాదనలకు కూడా  శాస్త్రీయమైన ఆధారాలు లేవు. ఇల్మనైట్ వంటి ఖనిజాలను నియంత్రిత జాబితా నుండి తొలగించడం వల్ల స్మగ్లింగ్ పెరిగిందని కొందరు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, భారీ స్థాయిలో థోరియం రహస్యంగా ఎగుమతి కావడం సాధ్యం కాదని అణు శక్తి విభాగం చెబుతోంది.

ఏది ఏమైనా..  దేశ వ్యూహాత్మక వనరులైన థోరియం వంటి ఖనిజాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అక్రమ మైనింగ్‌ను అరికట్టడం ఎంత ముఖ్యమో..  సాంకేతికతను అభివృద్ధి చేసి అణు శక్తి రంగంలో స్వావలంబన సాధించడం కూడా అంతే  ముఖ్యం.  నిరాధారమైన ఆరోపణలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్న తరుణంలో..  ప్రభుత్వం, శాస్త్రీయ సంస్థలు ఈ అంశంపై పూర్తి పారదర్శకతతో కూడిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ భవిష్యత్తుకు అవసరమైన ఇంధన వనరులను కాపాడుకోవడమే మనందరి ప్రాధాన్యత కావాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...