తరిమేవరకూ పదవులు వదలరా?

posted on: Jun 20, 2014 11:16AM

 

 

 

పదవులు పట్టుకుని వేలాడటం రాజకీయ నాయకులకు వుండే సహజలక్షణం. తమకు ఆ పదవిలో కొనసాగే అర్హత, నైతిక హక్కు లేదని తెలిసినా పదవిని పట్టుకుని గబ్బిలాల్లా వేలాడుతూనే వుంటారు. అలాంటి కొంతమంది గబ్బిలం బ్యాచ్ రాజకీయ నాయకులలో కొన్ని గబ్బిలాలు తరిమితే పోతాయి. కొన్ని గబ్బిలాలు మాత్రం తరుముతున్నా పోకుండా సదరు సీటును పట్టుకుని వేలాడుతూ వుంటాయి. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో అలాంటి గబ్బిలాలు బోలెడన్ని వున్నాయి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ హయాంలో ఎంతోమందిని ఎన్నెన్నో నామినేటెడ్ పోస్టుల్లో పెట్టింది. కొంతమంది పదేళ్ళుగా, మరికొంతమంది కొన్నేళ్ళుగా ఆ పదవులలో సౌఖ్యాలు అనుభవిస్తు్న్నారు. వారిలో కాంగ్రెస్ హయాంలో నియామకాలు పొందిన గవర్నర్లు కూడా వున్నారు. నైతికంగా చెప్పాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు సదరు పెద్దలంతా తమ పదవుల నుంచి తప్పుకోవడం మర్యాద. గవర్నర్ లాంటి పదవుల్లో వున్నవారు మాత్రం కేంద్రం ఆదేశాలు వచ్చేవరకూ పదవుల్లో వుండొచ్చుగానీ, కొర్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లాంటి వాటిలో పదవుల్లో వున్నవారు ప్రభుత్వాలు మారగానే తమ పదవులకు రాజీనామాలు చేయడం అయితే, కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి చాలాకాలమవుతున్నా ఇప్పటికీ చాలామంది పదవుల మీద వ్యామోహం తీరక కుర్చీలకు అతుక్కుపోయి కూర్చున్నారు. అలాంటి వారిని వదిలించుకోవడానికి కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టాయి. ప్రభుత్వాలు తరిమేస్తూ వుండటంతో కొంతమంది తమ పదవులకు రాజీనామాలు చేశారు. తాజాగా విపత్తు నివారణ సంస్థకు అధ్యక్షుడిగా వున్న మర్రి శశిధర్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించేంత వరకు పదవిని వదల్లేదు. అలాగే మరికొన్ని జాతీయ ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో వున్నవారు గవర్నమెంట్ తరిమే వరకూ పదవుల్లోనే వేలాడే ఉద్దేశంలో వున్నారు. అలాంటి చాలామందిని ప్రభుత్వాలు వదిలించుకునే పనిలోపడ్డాయి. కొంతమంది గవర్నర్లు అయితే ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్ళేట్టు వున్నారని తెలుస్తోంది. అయితే కేంద్రం తలుచుకుంటే వాళ్ళ పప్పులు ఉడకవనేది సత్యం. ఏది ఏమైనా తరిమేవరకూ పదవులను పట్టుకుని వేలాడటం సరైన పద్ధతి కాదన్న అభిప్రాయాలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...