తెలంగాణలో ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ చార్జిషీట్
posted on Nov 11, 2025 7:44PM

తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తును వేగవంతం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ, మూడు వేర్వేరు కేసుల్లో 21 మంది మావోయిస్ట్ కార్యకర్తలపై చార్జిషీట్ దాఖలు చేసింది.
ఎన్ఐఏ వెల్లడించిన ప్రకారం, ఈ చార్జ్ షీట్లు ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు దాఖలు చేశారు. అరెస్టయిన 20 మందితో పాటు ఒక పరారీలో ఉన్న వ్యక్తిపైన కూడా ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టం మరియు BNSSలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ మూడు వేర్వేరు చార్జిషీట్లను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు.
ఎన్ ఐ ఏ దర్యాప్తులో భాగంగా, నిందితులు కరిగుట్ట కొండ ప్రాంతాన్ని మావోయిస్టు కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా మార్చేందుకు కుట్ర పన్నినట్లుగా తేలింది.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, హింసాత్మక దాడులు జరపడం ద్వారా దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, మరియు రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీయడం ఈ కుట్ర ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
సిపిఐ మావోయిస్టు సీనియర్ కార్యకర్తలు పన్నిన మావోయిస్టు కుట్రలో 21 మంది నిందితులు చురుగ్గా పాల్గొన్నట్లు తేలింది. ఈ సంవత్సరం మే నెలలో అదుపులోకి తీసుకున్న కుంజం లక్కా, మరిగల సుమతి, కర్తం జోగా, కర్తం భీమా, హేమల సుక్కి తదితరులు కీలక పాత్ర పోషించినట్లుగా అధికారులు గుర్తించారు.
తెలంగాణ పోలీసులు ములుగు జిల్లాలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో వీరందరినీ అదుపు లోకి తీసుకుని వారి వద్ద నుండి ఆటోమేటిక్ అస్సాల్ట్ రైఫిళ్లు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం మరియు ఇతర నేరారోపణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పోలీసుల నుండి ములుగు జిల్లాలో నమోదైన మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. సిపిఐ (మావోయిస్టు) తన పునరుజ్జీవన ప్రయత్నాలను అడ్డుకోవడం లక్ష్యంగా దర్యాప్తును కొనసాగిస్తోంది.