Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్టీసీ సమ్మె వెనుక బీఆర్ఎస్ కుట్ర...మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
posted on: Apr 22, 2026 2:22PM

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న తరుణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నా, జేఏసీ నేతలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమ్మెకు వెళ్లడం పరిష్కారం కాదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో కార్మికుల 32 డిమాండ్లపై చర్చ జరిగింది. అయితే, 'ఇప్పుడే వస్తామని' చెప్పి సమావేశం నుంచి బయటకు వెళ్లిన నేతలు తిరిగి రాకపోగా, ముందస్తు సమాచారం లేకుండానే సమ్మెకు పిలుపునివ్వడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
చర్చల్లో లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 అంశాలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి వెల్లడించారు. కేవలం ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై కూడా చర్చలు జరపవచ్చని పేర్కొన్నారు. కార్మిక చట్టాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
ఈ సమ్మె కేవలం కార్మికుల ప్రయోజనాల కోసం కాదని, ఇది పూర్తిగా బీఆర్ఎస్ నాయకుల కుట్ర అని మంత్రి ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు హరీశ్ రావు ఈ సమ్మెను ప్రేరేపిస్తున్నారని, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసి రాక్షసానందం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఆర్టీసీ కార్మికులు వాస్తవాలను గ్రహించాలని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, ప్రజలకు అసౌకర్యం కలిగించడం సరికాదని హితవు పలికారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన కోరారు.
ప్రస్తుతం కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోందని, నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏది ఏమైనా, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల రవాణా వ్యవస్థను బందీ చేయడాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం సహించదని ఆయన సంకేతాలిచ్చారు. సామాన్యుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్మిక సంఘాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు.



.webp)


