టీ కాంగ్రెస్ ‘పేరాశ’!

 

 

 

ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వస్తుందో రాదో తెలియని తెలంగాణ రాష్ట్రానికి పేర్లు డిసైడ్ చేసేస్తున్నారు. జైపాల్‌రెడ్డి నాయకత్వంలో కేంద్ర మంత్రుల బృందానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చివరి విడత నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో తమ గొంతెమ్మ కోర్కెల చిట్టాని పొందుపరచడంతోపాటు రాష్ట్రం రెండు ముక్కలైపోయిన తర్వాత రెండు ముక్కలకూ ఏయే పేర్లు పెట్టాలో కూడా సూచించేశారు. తెలంగాణ ప్రాంత ముక్కకి ‘తెలంగాణ’ అని పేరు పెట్టాలట. ఇందులో వెరైటీ ఏముందని అనుకుంటున్నారా? వుంది..

 

అదేంటంటే, మాకు ‘రాయల తెలంగాణ’ వద్దు.. కేవలం ‘తెలంగాణ’ మాత్రమే కావాలని మంత్రుల బృందానికి చెప్పకనే చెప్పారన్నమాట. సరే, వాళ్ళ ప్రాంతం వాళ్ళిష్టం అని ఊరుకుందామనుకుంటే, వాళ్ళకి సంబంధంలేని మిగతా ముక్కకి కూడా పేరు వాళ్ళే సూచించారు. మరో ముక్కకి ‘సీమాంధ్ర’ అని పేరు పెట్టాలట. అంటే టోటల్‌గా ‘ఆంధ్రప్రదేశ్’ అనే మాటకే టెండర్ పెట్టేశారన్నమాట! సీమాంధ్ర ప్రాంతానికి ‘ఆంధ్రప్రదేశ్’ అనే పేరు కంటిన్యూ చేస్తే ‘ఆంధ్రప్రదేశ్’ అనే పదానికి ఇప్పటి వరకూ ఉన్న గుర్తింపు సీమాంధ్రులకు సొంతం అయిపోతుంది. దాన్ని కూడా తట్టుకోలేక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ‘సీమాంధ్ర’ అనే పేరు సూచించారు. ఈరకంగా కూడా సీమాంధ్రులకు గుండుకొట్టాలని చూస్తున్నారు.ఇంతకంటే కుళ్ళుమోతుతనం ఇంకోటి వుంటుందా? రాష్ట్రాల పేర్ల విషయంలో వీళ్ళ ‘పేరాశ’ నలుగురూ నవ్వుకునేలా వుంది! ఇక వీళ్ళ సంగతి ఇలా వుంటే, సోనియా గాంధీకి గుడి కట్టేస్తానని తెగ హడావిడి చేస్తున్న శంకర్రావు కూడా కొత్తగా ఏర్పడుతుందని కలలు కంటున్న తెలంగాణ రాష్ట్రానికి పేరు డిసైడ్ చేసేశాడు. కొత్త రాష్ట్రానికి శంకరన్న గారు సూచిస్తున్న అమూల్యమైన పేరు ‘సోనియా తెలంగాణ’!  భవిష్యత్తులో పొరపాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఇలాంటి విభజనవాదుల నుంచి తెలంగాణ ప్రజలను ఆ దేవుడే రక్షించాలి.